10-04-2025 01:36:53 AM
సంగారెడ్డి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి)/పటాన్‌చెరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి కేసులు పెడితే.. అవితప్పుడు కేసులని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిరూపించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే హరీశ్‌రావు అన్నారు.
విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించడంతో అవి తప్పుడు కేసులని నిరూపణ అయినట్లేనని చెప్పా రు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని గణేశ్‌గడ్డ దేవా లయంలో ప్రత్యేక పూజల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలన చూస్తుంటే తోక కుక్కను ఆడిస్తుందా, కుక్క తోకను ఆడిస్తుందా అర్థం కావడం లేదన్నారు.
అక్రమ కేసులు నమోదు చేయించినందుకు సీఎం భేషరతుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్‌రెడ్డి నరికివేస్తున్నాడని, మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల భూమి తీసుకొని అక్కడ చెట్లను నరికివేయించాడని, నిన్న హెచ్‌సీయులో చెట్లను నరికివేసి మూగ జీవాల ఉసురు పోసుకున్నాడని వాపోయారు.
హైడ్రా అంటూ ఆరు నెలలు పరిగెత్తి చతికిలపడ్డాడని, పేదల ఇండ్లను కూలగొట్టాడని, ఈ దెబ్బకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఈగలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రియల్ వ్యాపారం పెరిగితే రేవంత్ పాలనలో అథాపాతాళానికి దిగిపోయిందన్నారు. ఏది చూసినా సగంసగం అంతా ఆగమాగమేనన్నారు.
రేవంత్‌ది చావు భాష
కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయాలని, ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులకు నీళ్లు అందిచాలంటూ సాగు భాష మాట్లాడితే, రేవంత్‌రెడ్డి నరుకుతా, చంపుతా అంటూ చావు భాష మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్‌రెడ్డి పడగొడుతున్నాడని విమర్శించారు. రేవంత్ పాలన వల్ల తెలంగాణ కేవలం 5 శాతం మాత్రమే వృద్ధిరేటు సాధించిందని చెప్పారు.
ఢిల్లీలో రేవంత్ పని అయిపోయింది
తెలంగాణ పరువును సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టాడని, ఢిల్లీలో కూడా రేవంత్ పని అయిపోయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీసీ సభకు రాహుల్‌గాంధీని తీసుకొస్తానని, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదింపజేస్తానని చెప్పినా రాహుల్‌గాంధీ ఢిల్లీలో ఉండికూడా రాలేదని తెలిపారు. మరుసటి రోజు రేవంత్‌రెడ్డి లేకుండా పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రితో ఫొటోలు దిగారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు.