calender_icon.png 28 September, 2024 | 4:48 AM

ఇలాగైతే జైలుకు వెళ్తారు

28-09-2024 02:57:53 AM

సహకార శాఖ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ అవకతవకలపై సమర్పించిన విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా స్పందించని సహకార శాఖ కమిషర్, రిజిస్ట్రార్ హరితపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇలాగైతే కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణ నివేదికపై చర్యలు తీసుకోవడంలో జాప్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. గత మేనేజింగ్ కమిటీ అవకతవకలపై విచారణ జరిపి సమర్పించిన నివేదికపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో జూబ్లీహిల్స్ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీ ముకుంద్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. విచారణకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ ఎం హరిత వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ నివేదికను పిటిషనర్‌కు అందజేశారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.