calender_icon.png 11 October, 2024 | 5:01 AM

పనితీరు మెరుగవ్వకుంటే సింగరేణి మనుగడ కష్టం

11-10-2024 02:05:31 AM

  1. ఉత్పాదకత పెంచేందుకు కార్మిక సంఘాలు సహకరించాలి
  2. సింగరేణి సీఎండీ ఎన్ బలరాం

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): సింగరేణి ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపర్చుకోకపోతే కంపెనీ మనుగడ కష్టమని, పని సంస్కృతిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు కార్మికులతోపాటు కార్మిక సంఘాలు కూడా సహకరించాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ‘ఉజ్వల సింగరేణి  ఉద్యోగుల పాత్ర’ అంశంపై హైదరా బాద్‌లోని సింగరేణి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎండీ ఎన్ బలరాం పాల్గొని సింగరేణి ఆర్థిక స్థితిగతులు, పనితీరును వివరించారు. సింగరేణి సాధిస్తున్న లాభాలు కేవలం బొగ్గుఉత్పత్తి వల్లే అని చాలా మంది భావిస్తున్నారని,  కానీ వాస్తవానికి బొగ్గు వల్ల వస్తున్న లాభాల కంటే ఇతరత్రా ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ వల్ల సమకూరుతున్న నిధులతోనే లా భాలు పెరిగాయని వివరించారు.

సంస్థ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందు కు గడిచిన నాలుగేండ్లలో అనేక విప్లవాత్మక చర్యలు తీసు కున్నామన్నారు. గతంలో సింగరేణి సంస్థ అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేదని.. ఇప్పుడు సింగరేణి ఆర్థిక పరపతి పెరిగినందున బ్యాంకులు సింగరేణికి అప్పులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. బ్యాంక్ రుణాలను తక్కువ వడ్డీలకు ఇచ్చే బ్యాంకులకు బదలాయించడంతో వడ్డీ భారం తగ్గిందన్నారు.

కంపెనీ భవిష్యత్ కోసం చేసిన డిపాజిట్ల వల్ల వచ్చే వడ్డీ ఆదాయమే రూ.900 కోట్లకుపైగా ఉందని తెలిపారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా ఏడాదికి సుమారు రూ.500 కోట్ల లాభం వస్తుందన్నారు.ప్రాతినిధ్య కార్మిక సంఘం తరఫున ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్, మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్‌ప్రసాద్, కోఆర్డినేషన్ జీఎం ఎస్డీఎం సుభానీ, మార్కెటింగ్ జీఎం రవిప్రసాద్ పాల్గొన్నారు.