- నిద్రమత్తు వీడి పనులు చేయండి
- సీఈ మోహన్ నాయక్ నిలదీత
- రెండేళ్లలో మామునూరు ఎయిర్‌పోర్ట్
- సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): వర్షాలకు రోడ్లపై గుంతలు పడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇంకా ఎస్టిమేషన్లు, టెండర్లు అంటూ కాలక్షేపం చేయడమేంటని అధికారులపై ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిద్ర మత్తు వీడి వెంటనే రోడ్లను రిపేర్ చేయాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు చెప్పడం కాదని, తనకు ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘రోడ్లు బాగున్నాయని మీరు.. బాగా లేవని ప్రజలు అంటున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా ఆఫీసులో కూర్చుని సమాధానం చెప్తున్నారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాచ్‌వర్క్స్ చేసేందుకు ఇంత ఆలస్యమెందుకవుతుందని ప్రశ్నించారు.
పొరుగు రాష్ట్రాల్లో జెట్ ప్యాచ్ వర్క్ మెషీన్లు, వెలాసిటీ ప్యాచింగ్ వంటి అధునాతన పద్ధతులతో గుంతలను రిపేర్లు చేస్తుండగా.. తెలంగాణలో మాత్రం ఇంకా కాలం చెల్లిన పాత పద్ధతుల్లోనే రిపేర్లు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులకు తమ నైపుణ్యాల పట్ల ఉన్న శ్రద్ధ ఇదేనా అంటూ చురకలు వేశారు.
సీఈ నిలదీత..
రూ.500 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు రూ. 4-5 వేల కోట్ల విలువ చేసే రోడ్లను రిపేర్ చేయవచ్చని, కానీ ఎక్కడా ఆ దిశగా ఎందుకు అడుగులు పడటం లేదని స్టేట్ రోడ్స్ సీఈ మోహన్ నాయక్‌ను ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన ఏఈఈలను ఇప్పటిదాక కనీసం ఫీల్డ్‌కు కూడ పంపకపోవడం ఏంటని ఆయనను నిలదీశారు. ఇంజినీర్లంతా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ కొత్త రోడ్లను ప్రపోజల్స్ తయారు చేసే కన్సల్టెంట్లుగా మారారని.. అసలు గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి ఇంజినీర్లకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు.
రెండేళ్లలో ఎయిర్‌పోర్ట్ పూర్తి చేయాలి..
రెండేళ్లలో వరంగల్ ఎయిర్ పోర్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలనిమంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. 15 రోజులకోసారి పనుల పురోగతిపై రివ్యూ చేస్తానని, ఎయిర్ పోర్ట్‌ను ఉడాన్ స్కీంతో అనుసంధానం చేయాలని ఏవియేషన్ డైరెక్టర్ ఉన్నతాధికారులకు సూచించారు.
రామప్ప, భద్రకాళీ, వెయ్యిస్తంభాల దేవాలయం, టెక్స్‌టైల్ పార్క్, రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియా వంటి ఉండడంతో అందుకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దాలన్నారు. సమీక్షలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్‌రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వెయ్యి కోట్ల పని ఇలా ఏడ్చింది
సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుర్చీ కింద టైల్స్ ఫిట్టింగ్ నిర్లక్ష్యాన్ని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి చూపించారు. వెయ్యికోట్లకు పైగా ఖర్చుపెట్టి నిర్మించిన సచివాలయంలో మన ఇంజినీర్ల పనితీరు ఇంత నిర్లక్ష్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్కారు ఖర్చుపెట్టే ప్రతీ పైసా ప్రజల సొమ్మని, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ప్రతీది నాణ్యంగా ఉండాలన్నారు. వరంగల్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న టిమ్స్ హాస్పిటల్స్‌ను 2025 జూలై నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై ప్రతీ వారం సమీక్ష జరపాలని ఆదేశించారు.