calender_icon.png 27 October, 2024 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్ చెల్లించకపోతే విచారణకు రండి

18-09-2024 12:00:00 AM

  1. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు ఉత్తర్వులు 
  2. ఈ నెల 27కు విచారణ వాయిదావేసిన హైకోర్టు 

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మలేరియా కేంద్రాల్లో ఫీల్డ్ వర్కర్లుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారికి విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీసు లెక్కించి పెన్షన్ చెల్లించాలన్న తమ ఉత్తర్వులను అమలుచేయని పక్షంలో వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని ఇద్ద రు ఐఏఎస్ అధికారులతోపాటు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

2022 నవంబరులో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని, లేదంటే వైద్యఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్లు వ్యక్తిగ తంగా హాజరుకావాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నల్లగొండ జిల్లాకు చెందిన వై సత్తిరెడ్డి సహా పదిమంది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాదివాదనలు వినిపిస్తూ జిల్లా మలేరియా కేంద్రంలో ఫీల్డ్ వర్కర్లుగా విధుల్లో చేరారని తెలిపారు. 2010లో ప్రభుత్వం వీరిని క్రమబద్ధీకరించిందని చెప్పారు.

ఉద్యోగ విరమణ తరువాత క్రమబద్ధీకరణ తేదీ నుంచే పెన్షన్ లెక్కించడంపై హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. తాము విధు ల్లో చేరిన 1994 నుంచి సర్వీసు లెక్కించి ఆ మేరకు పెన్షన్ ప్రతిపాదనలు పంపి, పెన్షన్ చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించినా, అమలు కావడంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉత్తర్వుల అమలు నిమిత్తం కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.