ప్రేమించి పెళ్లి చేసుకున్న వారైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఆ కొత్త జంట కొన్నాళ్ల పాటు ఎంతో స్నేహంగా, ప్రేమతో ఉంటారు. కానీ తర్వాత నిత్యం ఒకరిపై మరొకరు మండిపడుతుంటారు. దాంపత్యంలో ఇరువురి మధ్య తొలిరోజుల్లో ఉండే ప్రేమ జీవితాంతం కొనసాగితేనే ఆ బంధం బలంగా పెనవేసుకుంటుందని చెబుతున్నారు మానసిక నిపుణులు.
చిన్నప్పటి నుంచి చదువు, ఉద్యోగం వరకు ప్రతి అంశంలో నేను అనే భావన ఉండటం సహజం. అయితే పెళ్లి తర్వాత ఆ భావనను క్రమం గా తగ్గించుకొని మనం అనే దానికి అలవాటు పడాలి. సినిమా, షాపింగ్, స్నేహితులను కలవడం వంటివాటికి భాగస్వామితో కలిసి వెళ్లాలి. అప్పుడే దంపతుల మధ్య దూరం పెరగకుండా ఉంటుంది.
పనులెన్ని ఉన్నా రోజూ కొంత సమయం జీవితభాగస్వామి కోసం కేటాయించాలి. కష్ట సుఖాలే కాదు, అభిరుచులు, ఆసక్తి వంటివన్నీ పంచుకోవాలి. అలాగే కొందరికి ప్రేమను వ్యక్తపరచడం రాకపోవచ్చు. దీంతో భాగస్వామి తమపై ప్రేమ లేదని అపోహపడొచ్చు.
వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే చిన్నచిన్న సందర్భాల్లో కూడా మీ మనసులోని ప్రేమను వారిని దగ్గరకు తీసుకొని చెప్పాలి. జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాంతో సమస్యలకు తావుండదు.