పాత్ర ఏదైనా ఒదిగిపోయే నటీమణులు కొందరే ఉంటారు. ప్రస్తుత తరుణంలో అలాంటి వారు కనీసం వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది కూడా లేరు. ఆ అతి తక్కువ మందిలో టాప్ ప్లేస్‌లో సాయి పల్లవి ఉంటారు. ఆమెను చూసిన ఏ ఇండస్ట్రీ వారైనా తమ ప్రాంతానికి చెందిన అమ్మాయే అనుకోవడం సహజం. అంతలా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ‘ఫిదా’ చిత్రం చూసిన వారంతా ఈ సింగిల్ పీస్‌ను తెలంగాణ ఆడపడుచుగానే భావించారు.
పాత్ర ఏదైనా సరే దానిలో పరకాయ ప్రవేశం చేస్తుంది. అందుకే అమ్మడికి అంత ప్రేక్షకాదరణ. ఇప్పటికే ‘ఫిదా, విరాఠపర్వం’ చిత్రాలతో తెలంగాణ బిడ్డగా మారిపోయిన సాయిపల్లవికి వరుసగా తెలంగాణ నేటివిటీకి చెందిన చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా మరో తెలంగాణ నేటివిటీకి చెందిన చిత్రంలో అవకాశం లభించిందని టాక్.
‘బలగం’ వేణు దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైందని రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమాకు సాయి పల్లవి అయితేనే న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రేక్షకులు కూడా తెలంగాణ బిడ్డగా ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆమె అయితే చిత్రం సూపర్ హిట్టే అనడంలో సందేహం లేదని నెట్టింట టాక్ నడుస్తోంది.