calender_icon.png 24 October, 2024 | 12:53 PM

Breaking News

ఒక్కటి పడితే..

02-08-2024 12:05:00 AM

ఆగస్టు 1 అనన్య నాగళ్ల పుట్టినరోజు సందర్భంగా ఆమె కథానాయికగా నటిస్తున్న ‘పొట్టేల్’ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు చిత్ర బృందం. అందం, అభినయం కలగలిపి చక్కటి అవకాశాలను అందుకుంటోన్న ఈ తెలుగింటి అందం.. తెలుగు అమ్మాయిలకి సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదన్నది పాతకాలం నాటి మాటని, ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మారాయని చెబుతోంది. ‘మల్లేశం’ సినిమాతో తెలుగు వారి ముంగిట్లోకొచ్చిన అనన్య, పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిన ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువైంది.

తర్వాత ‘మేస్ట్రో’, ‘శాకుంతలం’ తదితర చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించిన ఆమె, కథానాయికగానూ చక్కటి అవకాశాలను చేజిక్కించుకుంటోంది. పాత్రధారిగా పలు సినిమాలు చేస్తూనే, కథానాయికగా కొనసాగడంలో ఏవైనా ఇబ్బందులున్నాయా అంటే.. ఇప్పటి వరకు అటువంటివేవీ తలెత్తలేదన్న అనన్య.. ఆ రకంగా తనకు తగిన కథల్ని, పాత్రల్ని చేయడం సంతోషంగా ఉందని అంటోంది.

ఇటీవల విడుదలైన ‘డార్లింగ్’ సినిమాలో మానసిక వైద్యురాలిగా కనపడిన అనన్య, అంజలి ప్రధాన పాత్ర పోషించిన ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్‌లోనూ భాగమైంది. ప్రస్తుతం ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’, ‘పొట్టేల్’ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సత్తుపల్లి సోయగం, సరైన హిట్ ఒక్కటి పడితే.. తెలుగమ్మాయిలు కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటారని నమ్మకంగా చెబుతోంది. ఆ స్థానాన్ని అనన్య నాగళ్ల అందుకుంటుందేమో చూద్దాం..!