calender_icon.png 29 October, 2024 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాకుంటే.. అరెస్టే

29-10-2024 02:39:41 AM

  1. ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారంలో రాజ్ పాకాలకు పోలీసుల నోటీసులు
  2. డ్రగ్స్ వ్యవహారంపై అధికార,ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు
  3. అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌పాకాల
  4. పోలీసుల ఎదుట హాజరుకు రెండు రోజులు గడువు ఇచ్చిన న్యాయస్థానం

హైదరాబాద్ సిటీ బ్యూరో/రంగారెడ్డి, అక్టోబర్ 28 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండ లంలోని జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది. ఇటు అధికార, అటు ప్రతిపక్షపార్టీల నేతల మధ్య మాటల తూటా లు పేలుతున్నాయి.

సోమవారం మోకి లా పోలీసులు మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు బీఎన్‌ఎస్ 35(3), (4), (5), (6) సెక్షన్ల కింద నోటీసులు జారీచేశారు. ఈ కేసులో పోలీ సులు ఏ1గా రాజ్ పాకాల, ఏ2గా విజయ్ మద్దూరిపై కేసు నమోదు చేశారు. అనంతరం శంకర్‌పల్లిలోని జన్వాడలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‌హౌస్, రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లోని రాజ్ పాకాల నివాసం వద్ద గోడకు నోటీసులు అతికించారు.

విచారణకు తమకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్‌లతోపాటు, కేసుకు సంబంధించి సంబంధిత ధ్రువపత్రాలను వెంట తీసుకొని రావాలని, నిర్ణీత గడువులోగా పోలీస్‌స్టేషన్‌కు హాజరుకాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీ సులో పేర్కొన్నారు. ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కాగా, విచారణకు హాజర య్యేందుకు తనకు కొంత సమయం కావాలని మోకిలా పోలీసులకు తన న్యాయవాది ద్వారా లేఖ పంపారు. అలాగే నోటీసుల వ్యవహారం విషయంలో రాజ్ పాకాల సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు న్యాయస్థానం రెండు రోజుల సమయం ఇచ్చింది.

విజయ్ మద్దూరి విచారణకు సహకరించడం లేదు : మోకిలా పోలీసులు

జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో విజయ్ మద్దూరి విచారణకు సహకరించడం లేదని మోకిలా పోలీసులు తెలిపారు. ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫామ్‌హౌస్‌లో గేమ్ ఆడినట్టు దర్యాప్తులో తేలితే మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఫామ్‌హౌస్‌పై రైడ్స్ సమయంలో ఆయన మొబైల్ దాచిపెట్టి మరో మహిళ మొబైల్‌ను అందజేశారని పోలీసులు తెలిపారు.

తన మొబైల్ దొరికితే డ్రగ్స్ లింక్స్ బయటపడతాయన్న భయంతో వేరే మహిళ ఫోన్‌ను తమకు అందజేశారని మోకిలా పోలీసులు పేర్కొన్నారు. దాడుల సమయంలో విజయ్ మద్దూరి పక్కనే ఆయన సతీమణి ఉన్నారని చెప్పారు. దాడుల సమయంలో పోలీసులకు తెలియకుండా రాజ్ పాకాల పరారీ అయ్యారని వెల్లడించారు.

ఈ కేసులో రాజ్ పాకాల, విజయ్ మద్దూరి విచారణలో నోరు తెరిస్తే కేసు దర్యాప్తు ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీలో డబ్బులు కాకుండా కాయిన్స్ రూపంలో పేకాట అడినట్టు గుర్తించామని వెల్లడించారు. విజయ్ మద్దూరికి కొకైన్ ఎవరు ఇచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు.

పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తేలడంతో కలకలం 

రాజ్ పాకాల పార్టీలో ఆయన సన్నిహితుడు వ్యాపార భాగస్వామి విజయ్ మద్దూరి కొకైన్ తీసుకొన్నట్టు పోలీసులు తెలిపారు. తొలుత అతను డ్రగ్స్ వాడలేదని వాదించగా, డ్రగ్స్ పరీక్షలు చేశామని.. మూత్ర పరీక్షలో కొకైన్ వాడినట్టు తేలిందని చెప్పారు. డ్రగ్స్ పాజిటివ్ రావడంతో విజయ్‌ను అదుపులోకి తీసుకొన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, తన మిత్రుడు రాజ్ పాకాల ఆఫర్ చేస్తేనే తాను కొకైన్ తీసుకొన్నట్టు చెప్పడం గమనార్హం. ఈ కేసులో విజయ్ వాంగ్మూలం కీలకంగా మారింది. 

చెప్పని మాటలు వాంగ్మూలంలో నమోదు: విజయ్ మద్దూరి

తనపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేయడంపై సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో విజయ్ మద్దూరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్ పాకాల తనకు మద్యం ఇవ్వడంతో తాను తీసుకున్నానని వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు చెప్పిన మాటలను ఖండిస్తూ విజయ్ ఓ వీడియో విడుదల చేశారు. తాను అనని మాటలను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారని ఆరోపించారు.

తన మిత్రుడు రాజ్ పాకాల తమను కుంటుంబ సమేతంగా దీపావళి వేడుకల కోసం ఆహ్వానించారని చెప్పారు. ఫామ్‌హౌస్‌లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని స్పష్టంచేశారు. కానీ, తమను లక్ష్యంగా చేసుకొని పోలీసులు చేసిన ఆరోపణలు సరికాదని అన్నారు.

ఇటీవలే తాము ప్రపంచ పర్యటన ముగించుకొని భారత్‌కు వచ్చామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు చూపించినట్టు చెప్పారు. తాను అమెరికన్ సిటీజన్ అని, ముప్పు ఏళ్లకు పైగా సాఫ్ట్‌వేర్ రంగంలో అనుభవం ఉన్నవాడినని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారంతో తన ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని అన్నారు.