calender_icon.png 24 March, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసిఆర్ కు మరోసారి అధికారమిస్తే పంచభూతాలను దోచేవారే

22-03-2025 05:17:53 PM

రాష్ట్ర ప్రజలు విజ్ఞులు, అందుకే వారికి తగిన బుద్ధి చెప్పారు..

కేసిఆర్, హరీష్ రావుల అవినీతి, అక్రమాలపైనే నా పోరాటం.. 

ముగిసిన కాంగ్రెస్ పోరుబాట పాదయాత్ర...

గజ్వేల్: కేసీఆర్ కుటుంబం మరోసారి రాష్ట్రంలో అధికారం చేపడితే పంచభూతాలను కూడా దోచేసేవారని డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పోరుబాట పాదయాత్రలో భాగంగా శనివారం వర్గల్ మీదుగా ముడుగు మండలం వంటిమామిడి చేయడంతో గత మూడు రోజులుగా కొనసాగుతున్న పోరుబాట పాదయాత్ర  ముగిసింది. సందర్భంగా నర్సారెడ్డి ప్రసంగిస్తూ కేసిఆర్ ను బర్తరఫ్ చేయాలని ఇప్పటికే కోర్టులో కొందరు ప్రజా ప్రయోజన వాజ్యం వేయగా, భయంతోనే ఆయన అసెంబ్లీకి వచ్చి వెళ్లినట్లు ఎద్దేవా చేశారు.

గజ్వేల్ ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేగా జీతభత్యాలు పొందడం భావ్యం కాదని విమర్శించారు. కేసిఆర్ కుటుంబ అవినీతి, అక్రమాలపైనే తన పోరాటం కాగా, నమ్మించి నట్టేట ముంచిన కేసిఆర్ ను నిర్వాసిత గ్రామాల ప్రజలు నిలదీయాలని కోరారు. అంతేకాకుండా మల్లన్న సాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణంతో సర్వం కోల్పోయి అనాధలుగా మారిన బాధితులను ఆదుకోవాల్సిన కేసీఆర్ ఫాoహౌజ్ కే పరిమితం కావడం దురదృష్టకరమని, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాయడం కాకుండా దమ్ముంటే అసెంబ్లీలో నిర్వాసిత గ్రామాల ప్రజల ఇబ్బందులు, సమస్యలను లేవనెత్తాలని డిమాండ్ చేశారు. అయితే అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతో ఆ అంశాన్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు.

చైతన్యం కలిగిన గజ్వేల్ ప్రజలు ఇక్కడి దొరలను తరిమేయగా, మళ్లీ గడీల రాజ్యం తెచ్చేందుకు ఇక్కడి కొందరు నేతలు కేసిఆర్ కుటుంబానికి తాబేదార్లుగా మారినట్లు ఆరోపించారు. ముఖ్యంగా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లక్షకు పైగా జీవోలు మాయం కాగా, వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టాలని సూచించారు.  అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసీఆర్ సర్కార్ అన్ని శాఖల్లోనూ అక్రమాలకు పాల్పడగా, ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్లు చెప్పారు. కేసిఆర్ లో మార్పు తేవాలని, గజ్వేల్ ప్రజల ఇబ్బందులు పరిష్కరించే క్రమంలో ప్రభుత్వం నుండి నిధులు సాధించాలని, గజ్వేల్ ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ను గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ తో పోరుబాట పాదయాత్ర చేపట్టి సోమవారం రాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రం అందించనున్నట్లు వివరించారు.