calender_icon.png 30 April, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం అప్పగిస్తే ఉత్తమ్ నియోజకవర్గానికీ నీళ్లిస్తాం

30-04-2025 12:58:58 AM

  1. ధాన్యం కొనుగోలు, బోనస్ చెల్లింపు వివరాలపై లెక్క చెప్పాల్సిందే
  2. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను తమకు అప్పగిస్తే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నియోజకవర్గమైన హూజూర్‌నగర్‌కు నీళ్లు అందించి చూపిస్తామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చురకలంటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రులకు పాలన చేతగాక కేసీఆర్ ప్రసంగంపై విమర్శలు చేస్తున్నారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై ఎన్డీఎస్‌ఏ సమర్పించిన నివేదిక సరైనదని మంత్రి ఉత్తమ్ నిరూపిస్తే తన ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. కేసీఆర్‌ను దెబ్బతీసేందుకే ఈ రిపోర్టు విడుదల చేశారని, అది పూర్తిగా పని చేయని నివేదిక అని దుయ్యబట్టారు. కేవలం శునకానందం కోసమే ఈ రిపోర్టును రూపొం దించారని మండిపడ్డారు.

కేఆర్‌ఎంబీలో మనకు వచ్చే నీళ్లను వాడుకునే దమ్ము ప్రభుత్వానికి లేదని, 130 టీఎంసీల నీళ్లు ఏపీ ప్రభుత్వం తీసుకుపోతుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, బోన స్ చెల్లింపు వివరాలపై లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.

అలా చేయని పక్షం లో పాలన చేతగాని వాళ్లమని ఒప్పుకోవాలని సవాల్ విసి రారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఇక ఎల్కతుర్తి సభలో పేరు చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి బాధపడుతున్నారని.. కానీ ఆయన పేరు మంత్రులు, ఎమ్మెల్యేలే గుర్తు పెట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

తెలంగాణ పాలిట కాంగ్రెస్ విలన్‌గా మారిందని, రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు.  ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లారంటున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. మోదీ సభలో ఆయన ఎప్పుడైనా ప్రసంగించారేమో చూసుకోవాలని ఎద్దేవా చేశారు.

అలాగే గుజరాత్‌లో నిర్మాణం కాకముందే కూలిపోయిన నిర్మాణాల్లో 150 మంది మరణించడంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ లాగా ఒక్కరే మాట్లాడే సభను కాంగ్రెస్ నేతలు పెడితే చూడాలని ఉందని చురకలంటించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్,  గొంగిడి సునీత, భూపాల్ రెడ్డి, భాస్కరరావు, రవీంద్రకుమార్‌లు పాల్గొన్నారు.