- 12 గ్రామాల రైతులకు సాగునీరందిస్తున్న అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు
- త్రాగునీరుగా మార్చి కామారెడ్డికి తరలిస్తామన్న మున్సిపల్ ఛైర్మన్
- భగ్గుమన్న రైతులు.. నీటిని తరలిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక
- కలెక్టరేట్ ముందు ధర్నా.. ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కామారెడ్డి, జూలై 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోనే పెద్ద చెరువుగా పేరొందిన అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల రైతుల సాగునీటి అవసరాలను తీరుస్తుంది. అయితే, ఈ చెరువుపై కొంతమంది నాయకుల కన్ను పడింది. చెరువు నీటిని తాగునీటి అవసరాల కోసం కామారెడ్డికి తరలించి, రైతుల పంటలను ఎండబెట్టాలని, తద్వారా పంట భూములను ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకోవాలనే కుట్రకు తెరలేపారు. ఇందులో భాగం గానే 12 గ్రామాల రైతులకు 2500 ఎకరాలకు సాగునీరు అందించే పెద్ద చెరువు నీటి ని కామారెడ్డికి తరలిస్తామని ఇటీవల కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందు ప్రియా, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు.
దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్‌ల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు నుంచి చుక్క నీరు తరలించినా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గతం లో మాస్టర్ ప్లాన్ పేరుతో తమ పంట పొలాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చేసిన చర్యలను తిప్పికొట్టామని గుర్తు చేశారు. నీటి తరలింపునకు ప్రయత్నించే నాయకుల ఇండ్లను ము ట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ప్రకటనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 12 గ్రామా ల రైతులు మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
చెరువు నీటిని కామారెడ్డికి తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని నినాదాలు చేశారు. అయితే, కలెక్టర్ అందు బాటులో లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 12 గ్రామాల రైతుల ప్రయో జనాలను దృష్టిలో పెట్టుకొని కామారెడ్డికి అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని తరలించవద్దని కోరారు. అనంతరం కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కార్యాలయానికి తరలివెళ్లి మున్సిపల్ కమిషనర్ సుజాతతో పాటు ఇరిగేషన్ ఈఈ, ఎస్‌ఈలకు వినతిపత్రాన్ని అందజేశారు.
చెరువు నీటి జోలికి వస్తే ఉరుకోం
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మం డలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలోని పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణ తాగునీటి కోసం తరలిస్తామని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందూప్రియా ప్రకటించడాన్ని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే 12 గ్రామాల రైతులం రోడ్డెక్కి ఆందోళన చేపడతాం.
సంకరి రాజలింగం, రైతు, అడ్లూర్ ఎల్లారెడ్డి
మాస్టర్ ప్లాన్ తరహాలో మరో ఉద్యమం చేపడతాం
కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు తమ స్వలాభం కోసం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని కామారెడ్డికి తరలించేందుకు కుట్ర చేస్తున్నారు. గతంలో మాస్టర్ ప్లాన్ పేరుతో పంట భూములను కంపెనీలకు అప్పజెప్పేందుకు చేసిన కుట్రను తిప్పికొట్టాం. ఇప్పుడు, అడ్లూర్ ఎల్లారెడ్డి నీటిని తరలిస్తామంటే అలాంటి ఉద్యమం మళ్లీ తప్పదు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని రైతుల ప్రయోజనాన్ని కాపాడాలి. లేదంటే ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం.
ఎర్ర చిన్నమల్లయ్య, రైతు, రంగంపేట్