calender_icon.png 6 October, 2024 | 12:08 PM

నిబంధనలకు విరుద్ధమైతే నా ఫామ్‌హౌస్ కూల్చేస్తా

05-10-2024 01:17:45 AM

సీఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి

కేటీఆర్ ఫామ్‌హౌస్‌పై అధికారులే చూసుకుంటారు 

శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): తన ఫామ్‌హౌస్ ప్రభుత్వనిబం ధనల మేరకే ఉందని, ఒకవేళ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే తానే దగ్గరుండి కూల్చి వేయిస్తానని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి తన ఫామ్‌హౌస్ రూల్స్‌కు విరుద్ధంగా ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పట్నం మండిపడ్డారు.

శుక్రవారం ఆయన సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. 20 ఏండ్ల కిందటే అన్నీ డాక్యుమెంట్లు పరిశీలించి, అధికారులతో చర్చించిన తర్వాతే ఫామ్‌హౌస్ నిర్మించుకున్నట్లు మహేందర్‌రెడ్డి చెప్పారు. 111 జీవో అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. ఇటీవల సైతం మళ్లీ సర్వే చేసి బఫర్ జోన్‌లో లేదని అధికారులు నివేదిక ఇచ్చారని స్పష్టం చేశారు.

దూరం నుంచి చూస్తే నీళ్లలో ఉన్నట్లుగా కనిపిస్తోందని, కానీ ఎఫ్‌ఎటీఎల్, బఫర్ జోన్ పరిధిలో లేదన్నారు. తన ఫామ్‌హౌస్ పక్కనే సబితా ఇంద్రారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని ఆయన చెప్పారు. హిమాయత్‌సాగర్‌లో ఆక్రమణలు తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదని, దానికి అందరూ సహకరించాలని కోరారు.

తనకు నోటీసు వచ్చినా ఫామ్‌హౌస్ కూలగొట్టేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తాను గతంలో మంత్రిగా పని చేశానని, ఎవరితో  చెప్పించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నిబంధనలు ఎవరికైనా ఒక్కటేనని.. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో ఉంటే తనదైనా, కేటీఆర్, హరీశ్‌రావులవైనా కూల్చివేతలు తప్పవన్నారు. కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్‌కు అనుమతి ఉందా? లేదా? అనే విషయం అధికారులు చూసుకుంటారన్నారు.