20-04-2025 12:00:00 AM
అమ్మవారు.. చికెన్‌పాక్స్ అని కూడా పిలుస్తారు. ఇది వెరిసెల్ల జోస్టర్ అనే వైరస్ వల్ల వచ్చే సాధారణ వ్యాధి. చికెన్‌పాక్స్ వ్యాధి ఏ వయసులోనై వస్తుంది. కాని ఎక్కువగా ఈ వ్యాధి పిల్లలు, యువకుల్లో కనిపిస్తుంది. దీంతోపాటు చికెన్‌పాక్స్ కారణంగా శరీరంపై చిన్న ఎరుపురంగు దద్దుర్లు, అధిక జ్వరం వస్తుంది. కొన్నిసార్లు దద్దుర్లలో చీము కూడా ఏర్పడొచ్చు. వేసవిలో లేదా వానకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌పాక్స్ వచ్చిన రోగి పూర్తిగా కోలుకోవడానికి 10-15 రోజుల సమయం పడుతుంది.
చికెన్‌పాక్స్ పూర్తిగా తగ్గిన తర్వాత కూడా శరీరంపై కొన్ని మచ్చలు అలాగే ఉంటాయి. అవి పూర్తిగా నయం కావడానికి కనీసం ఐదు నెలల నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే.. ఈ వ్యాధిని నివారించడం సులభం అవుతుంది. చికెన్‌పాక్స్ లక్షణాలు.. జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
ఏం చేయకూడదు?
పచ్చివేపాకుపై పడుకోబెట్టడం వల్ల దురద ఎక్కువ అవుతుంది. రోజుల తరబడి స్నానం పోయకపోతే నీటి బుడగల్లో బ్యాక్టీరియా చేరి మరింత ప్రమాదం అవుతుంది. పసుపు యాంటీసెప్టిక్‌లా పనిచేస్తుంది కాని దురద నుంచి ఉపశమనం ఇవ్వదు. నోటి పూత, పేగులు కూడా పొక్కడం వల్ల ఏది పడితే అది తినడం మంచిది కాదు. నూనె, కారం, మసాలా తగ్గించి తినడం మేలు. పాలు, పెరుగు, తాజా పండ్లు తగినంత నీరు అవసరం. పసిపిల్లలకు సైతం తల్లిపాలు తాగించకుండా పోతపాలు పట్టడం, చెవుల్లో, ముక్కుల్లో నూనె చుక్కలు వేయడం, తీర్ధాలు, పసుపు నీళ్లు పట్టడం లాంటివి చేయకూడదు. నాటు మందులు, ఆకు పసర్లు లాంటివి తాగించడం వల్ల లివర్ ఫెయిల్ అయ్యి.. రోగి కోమాలోకి పోవడం, మరణించడం లాంటివి జరుగుతాయి.
వ్యాప్తి
చికెన్‌పాక్స్ సంవత్సరమంతా తక్కువ స్థాయిలో ఉంటూ.. మార్చి నుంచి జూన్ వరకు తరచుగా వస్తుంది. టీకా వేయించుకోకపోతే ఏదో ఒక వయసులో ప్రతి ఒక్కరికీ వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు తుమ్ములు, దగ్గు ద్వారా.. దగ్గరగా ఉంటే వారికి సోకుతుంది. చికెన్‌పాక్స్ టీకా మొదటి 15 నెలల వయసులో, రెండో డోసు 3 నెలల తర్వాత ఇవ్వాలి. 12 ఏళ్లు దాటిన వారికి కనీసం 4 వారాల వ్యత్యాసంతో రెండుసార్లు ఇప్పించాలి. అంతకుముందు ఒకే డోసు తీసుకున్న 12 ఏళ్ల లోపు పిల్లలకు రెండో డోసు ఇప్పించాలి. టీకాలు తీసుకున్న 1-4 శాతం పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు తక్కువ తీవ్రతగల వ్యాధి రావచ్చు. దీన్ని ’బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్‘ అంటారు.
వ్యాక్సీన్ గురించి..
వెరిసెల్ల వైరస్ సోకిన వారికి పొట్ట, వీపు భాగంలో దద్దుర్లు మొదలై శరీరమంతా అవి వ్యాపిస్తాయి. జ్వరం, తల, గొంతు, కడుపు నొప్పి ఉంటుంది. 101-, 102 డిగ్రీల జ్వరం వస్తుంది. కొందరికి నోట్లో పుండ్లు ఏర్పడి తిననడానికి ఇబ్బందిగా ఉంటుంది. బాధిత చిన్నారి తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా వ్యాధి ఇతరులకు సోకుతుంది. శరీరంపై దద్దుర్రలు కారణంగా అసౌకర్యంగా ఉంటుంది. దురద, మంట ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ల సూచనలతో నొప్పి నివారణ క్రీములు వాడాలి. సొంత వైద్యం చేసుకోవద్దు. దురద కారణంగా పిల్లలు దద్దుర్లను గోకడంతో పుండ్లగా మారి మరింత ఇబ్బందిగా మారుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవి గోకడంతో వచ్చే ఇబ్బందుల గురించి పిల్లలకు చెప్పాలి.
ఏం చేయాలంటే..
అమ్మవారు సీజనల్ వ్యాధి. ఎలాంటి చికిత్స లేకుండా చాలామందిలో 5-7 రోజుల్లో తగ్గిపోతుంది. జ్వరం, శరీరంపై దద్దుర్లతో వ్యాధి బయటపడుతుంది. ఆ సమయంలో పారాసిట్మాల్ మినహా ఎలాంటి మందుల అవసరం లేదు. దురద, మంట ఉంటే క్రీములు వాడొచ్చు. లక్షమందిలో 0.5శాతం మందికి మాత్రమే ఈ వ్యాధితో కొంత ఇబ్బంది, ముప్పు ఉంటుంది. ఈ సమయంలో కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, ఇతర పండ్లు, ద్రవాలు, అన్నం పెసరపప్పు కలిపి కిచిడి లాంటి తేలికపాటి ఆహారం అందించాలి. కారం, ఉప్పు, మసాలాలు ఎక్కువున్న పదార్థాలు ఇవ్వకూడదు. పసుపు, వేప ఆకులు వంటివి యాంటీసెప్టిక్ గా ఉపయోగపడతాయి. చాలాతక్కువ మందిలో పోస్టు వారిసెల్లా ఇబ్బందులు తలెత్తుతాయి. 3-4 రోజులు దాటి జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్య, తీవ్రమైన తలనొప్పి, నీరసంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.
లక్షణాలు
ముఖం, శరీరంపై ఎర్రటి దద్దుర్లు.
చేతులు, కాళ్లు, ముఖం ఎరుపు రంగులోకి మారడం.
అధిక జ్వరం, తలనొప్పి.
శరీరంలో దురద, బలహీనత.
జాగ్రత్తలు
శరీరం, చర్మం, పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి.
వైద్యులు సూచించిన మోతాదులో మందులు వాడాలి.
దురదకు కాలమైన్ లోషన్ రాసుకోవచ్చు. వైద్యుల సలహాపై యాంటీ హిస్టమిన్ మందులు వాడవచ్చు. పిల్లలు మరీ గోకేసుకుంటారు కాబట్టి గోర్లు కత్తిరించి, పలుచని బట్ట చేతులకు చుట్టేలియాలి.
తేలికగా అరిగే బలవర్థకమైన ఆహారం తినాలి.
ఇంట్లో ఒకరికి చికెన్‌పాక్స్ వచ్చినప్పుడు తీవ్ర వ్యాధి కలిగే ప్రమాదం ఉన్నవారు, ఇది వరకు ఈ వ్యాధి రానివారు రోగికి దూరంగా ఉండాలి.
ప్రమాద లక్షణాలపై కనీస అవగాహన కలిగి ఉండి, సత్వర వైద్యం చేయించుకోవాలి.
చికెన్ పాక్స్ వెరిసెల్ల వైరస్ కారణంగా వస్తుంది. ఎక్కువగా జనవరి నుంచి మే నెల మధ్య వ్యాపిస్తుంది. చికెన్ పాక్స్ వచ్చే రెండు రోజుల ముందు శరీరం పైన ఎర్రటి చిన్న దద్దుర్లు, తల నొప్పి, లోఫీవర్ లక్షణాలు కనిపిస్తాయి. రోగితో కాంటాక్ట్ లో ఉండటం ద్వారా లేదా రోగి తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని ప్రభావం 11 నుంచి 21 రోజుల పాటు ఉంటుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. 12 ఏళ్లు దాటిన వారికి వైరల్ మెడికేషన్ స్టార్ట్ చేయాలి. లేదంటే నిమోనియా, ఎన్సైఫ్లటిస్ కి దారి తీస్తుంది. పిల్లలకు 15 నెలల వయసులో వెరిసెల్ల వాక్సిన్ మొదటి డోస్ వేయించాలి. 18 నుంచి 19 నెలల వయసులో రెండో డోస్ వాక్సిన్ వేయించాలి.
- డాక్టర్ నారాయణ కృష్ణ ప్రసాద్, ఎంబీబీఎస్, డీసీహెచ్, ఎఫ్‌ఏఏపీ (యూఎస్‌ఏ),
అంకుర హాస్పిటల్ ఏఎస్‌రావు నగర్