calender_icon.png 3 April, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ భూముల జోలికొస్తే పతనం తప్పదు

02-04-2025 12:19:19 AM

హనుమకొండ, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికొస్తే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం తప్పదని విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్ సి యు విద్యార్థుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ, హెచ్‌సీయూ భూములను పెట్టుబడిదారులకు కట్టబెట్టాలనే  ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం  విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, మొదటి గేటు వద్ద దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులకు మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది.

అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మొదటి గేటు ముందు ఉన్న ప్రధాన రహదారిపై గంటసేపు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్.సి.యు. విద్యార్థుల పట్ల అప్రజస్వామికంగా వ్యవహరిస్తూ, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు తమకే దక్కాలని ప్రశ్నించిన హెచ్.సి.యు. విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ అత్యంత పాశవికంగా అణచివేసే చర్యలకు ఒడిగడుతున్నది. ప్రజా పాలన ముసుగులో రియల్ ఎస్టేట్ పెట్టుబడుదారి కార్పొరేట్ కంపెనీలకు యూనివర్సిటీ భూములను అప్పనంగా కట్టబెట్టే కుట్రపూరిత చర్యలను ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు.

హెచ్.సి.యు. విద్యార్థులపై లాఠీఛార్జీ కి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకొని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, జరిగిన సంఘటనలకు బాధ్యత వహిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి లోకానికి  బేషరతుగా క్షమాపణలు చెప్పాలని  డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు, ఎ.ఐ.ఎస్. ఎఫ్, పి.డి.ఎస్.యు, బి.ఆర్.ఎస్.వి,

యు.ఎస్.ఎఫ్.ఐ, డి.ఎస్.ఏ, పి.డి.ఎస్.యు, ఎం.ఎస్.ఎఫ్, ఎస్.ఎస్.యు, బి.ఎస్.యు, బి.ఎస్.ఎఫ్, విద్యార్థి సంఘాల నాయకులు మొగిలి వెంకట్ రెడ్డి,భాష బోయిన సంతోష్, బి.నరసింహారావు ,బైరపాక ప్రశాంత్, జెట్టి రాజేందర్, మాచర్ల శరత్ చంద్ర, సుమన్, మాలోత్ రాజేష్,  కె.శ్రావణ్, గణేష్, మర్రి మహేష్ ,ఇ.సాయి కుమార్,ఎ.గణేష్, మచ్చ పవన్ కళ్యాణ్, శివ నాస్తిక్,గణేష్, యాదగిరి, వేల్పుల చరణ్ ,ప్రణీత్, వంశీకృష్ణ, వీరు,సూర్య కిరణ్, రంజిత్,దామోదర్, అఖిల్, రాజేష్, తిరుపతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.