మొండిగా వ్యవహరిస్తే పోరాటం తప్పదు
తెలంగాణను కేసీఆర్ సమగ్ర అభివృద్ధి చేశారు
కాంగ్రెస్ పార్టీ చెప్పిన మార్పు ఎలా ఉంది ?
11 నెలల్లో స్థిరాస్తి రంగంపై మంచి నిర్ణయం లేదు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వం తన ఆలోచన మార్చుకొని ప్రజలకు మంచి చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని, ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. శ్రీనగర్ కాలనీలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ (టీఆర్‌ఎఫ్) సమావేశంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. టీఆర్‌ఎఫ్ మాదిరిగా టీఆర్‌ఎస్ సమావేశం పెట్టేవరకూ తెలంగాణ శక్తి ఎవరికీ తెలియలేదని చెప్పారు.
తెలంగాణ ఏర్పడితే భూముల విలువ పెరుగుతుందంటే ఎవరూ నమ్మలేదని, అసలు రాష్ట్రాన్ని నడిపే సమర్థత మీకు ఉందా? అంటూ అననుమానాలు వ్యక్తంచేశారని గుర్తుచేశారు. హిందూముస్లిం పంచాయితీ, నక్సలిజం సమస్యలు వస్తాయని, భూముల ధరలు పడిపోతాయని ప్రచారాలు చేశారని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి చేశారన్నారు. ‘అభివృద్ధే మా మతం, సంక్షేమమే మా కులం’ అని కేసీఆర్ స్ఫష్టంచేశారని, పొట్టకూటి కోసం వచ్చిన వారితో పంచాయితీ లేదని పేర్కొన్నారని యాదికి చేశారు.
ఛూమంతర్ అనగానే భూముల రేట్లు పెరగలే
ఛూమంతర్ అనగానే తెలంగాణలో భూముల రేట్లు పెరగలేదని కేటీఆర్ అన్నారు. భూములకు గతంలో నీళ్లు ఉండే పరిస్థితి లేదని, తన తాతకు కూడా వందల ఎకరాలు ఉండేదని, అయితే ఆ భూములకు విలువ ఉండేది కాదని పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ పాలనలో తెలంగాణలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా భూమి విలువ ఎకరానికి రూ.15 లక్షలు అయిందన్నారు. తెలంగాణలో నీళ్లు, కరెంట్ సమస్యను కేసీఆర్ తొలగించారని పునరుద్ఘాటించారు.
డెవలప్‌మెంట్ ఎందుకు జరగలేదు
కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అభివృద్ధి ఆటోమోడ్‌లో ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, అయితే ఈ ఏడాది డెవలప్‌మెంట్ ఎందుకుజరుగలేదని ప్రశ్నించారు. మంచిగ చేసిన కరెంట్‌ను కూడా నాశనం చేశారని విమర్శించారు. బ్లాక్‌మెయిల్ దందా కోసమే హైడ్రా ను పెట్టారని ఆరోపించారు. అనాలోచితంగా ఇళ్లు కూల్చివేయడంతో ఇంటి ఈఎంఐని ఎలా కట్టాలని ఓ గర్భిణి వాపోయిందని, హైడ్రా, మున్సిపల్‌శాఖ, ముఖ్యమంత్రి.. ఎవరు ఆమెకు సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో రియల్ ఎస్టేట్ బాగు కోసం ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
ముక్కుపిండి వసూలు చేస్తున్నారు
ఎన్నికల వేళ నో ఎల్‌ఆర్‌ఎస్.. నో బీఆర్‌ఎస్ అని కాంగ్రెస్ ప్రచారం చేసిందని, ఇప్పుడు ముక్కుపిండి ఎల్‌ఆర్‌ఎస్ వసూలు చేస్తోందని కేటీఆర్ విమర్శలు కురిపించారు. ప్రభుత్వ ఒక చేయి ఏంచేస్తుందో.. మరో చేయికి తెలియడం లేదని ఎద్దేవాచేశారు. హెచ్‌ఎండీఏలో రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ గెలవడం ఖాయమని రేవంత్‌రెడ్డికి తెలుసన్నారు.
రియల్టర్ల కోసం పోరాడుతాం
ప్రభుత్వ నిర్ణయాలను తెలుసుకోవాలని రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కేటీఆర్ సూచించారు. ఆ నిర్ణయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిం చాలని చెప్పారు. తాము కూడా శాసనసభలో ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టంచేశారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని తెలం గాణ బిల్డర్స్ ఫోరం మరింప బలపడాలని అన్నారు. రియల్టర్లను బెదిరించి డబ్బులు కావాలంటున్నారని, ఎందుకంటే ఢిల్లీకి డబ్బులు పంపాలి కదా! అని విమర్శించారు. మార్కెట్‌లో డబ్బులు లేని పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు.
ప్యారడైజ్‌లో కేటీఆర్ సందడి
సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌లో కేటీఆర్ సందడి చేశారు. ఇందిరాపార్కులో జరిగిన ఆటో డ్రైవర్ల మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్.. అనంతరం ప్యారడైజ్‌కు వెళ్లి పార్టీ నేతలతో కలిసి లంచ్ చేశారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, గోపినాథ్, కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలులో విఫలం
ముషీరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేటీఆర్ అన్నారు. మహాలక్ష్మి పథకంతో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుం బాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ స్కీం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
తాను ఆటోలో ధర్నాచౌక్‌కు వచ్చానని, ఆటో డ్రైవర్‌తో మాట్లాడితే తమ జీవితాలన్నీ అస్తవ్యస్తంగా అయ్యాయని, రాష్ట్రంలో ఉన్న ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇలాగే ఉన్నదని తన గోడును వెలిబుచ్చాడని కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చారని, ఇదే రాహుల్‌గాంధీ గతేడాది ఆటోలో ప్రజల వద్దకు వచ్చి ఎన్నో వాగ్ధానాలు చేశారని, కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మహాలక్ష్మిపథకానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు.
ఆటో డ్రైవర్ల ధర్నాకు ఎక్కువ మంది రాకుండా పోలీసులు కట్టడి చేశారని, పోలీసులు కూడా కష్టాల్లోనే ఉన్నారని అన్నారు. తమకు ఆటో డ్రైవర్ల కెపాసిటీ ఏంటో తెలుసని, మమ్మల్ని ఓడగొట్టడంలో వారి పాత్ర కూడా ఉందని కేటీఆర్ అన్నారు. అన్ని జెండాలు ఒక్కటై ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ధర్నాకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, నన్నపనేని నరేందర్ తదితరులు హాజరై మద్దతు తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ ప్రతినిధులు బీ వెంకటేశ్, ఉమర్ ఖాన్, వేముల మారయ్య, బిక్షపతి పాల్గొన్నారు.