calender_icon.png 11 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని అడ్డుకుంటే.. ఊరుకునేది లేదు

04-12-2024 02:28:33 AM

బీఆర్‌ఎస్, బీజేపీలు గూడుపుఠాని చేస్తున్నాయి

  1. ఎలా ఆపాలో మాకు తెలుసు 
  2. హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యోతో సమానంగా అభివృద్ధి చేస్తాం 
  3. 50 వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ ఏర్పాటు 
  4. మూసీపై ఎవరెన్ని కుట్రలు చేసినా పునరుజ్జీవం చేసి తీరుతాం  
  5. నగర అభివృద్ధికి కేసీఆర్, కేటీఆర్ వద్ద ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వాలి 
  6. అవి సహేతుకంగా ఉంటే స్వీకరిస్తాం 
  7. మాకు ఎలాంటి భేషజాలు లేవు 
  8. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ 

* గుజరాత్‌కు మోదీ నిధులు తీసుకెళ్తుంటే కిషన్‌రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నారు.. కిషన్‌రెడ్డి మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా ప్రజలు పట్టించుకోరు.

* హైదరాబాద్ అభివృద్ధికి మోదీ నుంచి రూ. లక్షన్నర కోట్లు తెస్తే పరేడ్ గ్రౌండ్‌లో కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తాం.

 సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి):  ‘హైదరాబాద్ అంటే రాష్ట్రంలోనే కాదు.. ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్ది, న్యూయార్క్, టోక్యో లాంటి  నగరాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రభు త్వం కృషిచేస్తోంది. నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ.7వేల కోట్లతో అభి వృ ద్ధి కార్యక్రమాలు చేపట్టాం.

ఎస్‌టీపీలు, ఫైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్య లు తీసుకుంటున్నాం. నగర అభివృద్ధికి బీఆర్‌ఎస్, బీజేపీలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. హైదరాబాద్‌కు అభివృద్ధికి రూ. లక్షన్నర కోట్లు ఖర్చుపెడితే అద్భుత నగరం అవుతుంది. కానీ, అభివృద్ధిని అడ్డుకుంటామని అనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు.. అభివృద్ధిని అడ్డుకునేవారిని ఎలా ఆపాలో మాకు తెలుసు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హైదరాబాద్ రైజింగ్’ వేడుకల్లో సీఎం మాట్లాడారు. ‘రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. గత  పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు నగరాభివృద్ధిని పట్టించుకోలేదు. ప్రజాపాలన కోసం ఏడాది క్రితం రాష్ట్ర ప్రజలు ఇదే రోజు తీర్పు ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షల వరకు పెంచాం. మెట్రోను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే. రీజినల్ రింగ్‌రోడ్డు తెలంగాణకే మణిహారం. రూ. 35 వేల కోట్లతో 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్‌రోడ్డుకు ప్రయత్నిస్తున్నాం. ఓర్‌ఆర్‌ఆర్‌కు అనుబంధంగా ముచ్చర్ల ప్రాం తంలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో అద్భుతమైన  ప్యూచర్ సిటీని నిర్మిస్తాం.

టోక్యో, న్యూయార్క్‌తో పోటీ పడేలా దానిని నిర్మిస్తాం’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.  గత సీఎం కేసీఆర్ అబద్ధాలతో గడిపారని.. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పారు.. కా నీ,  హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆయ న చేసిందేమి లేదని సీఎం మండిపడ్డారు.

కా లుష్యం పెరిగి.. ఢిల్లీ, ముంబై, చైన్నై,  కోల్‌కతా నగరాలు ప్రజలు నివసించేందుకు వీ లులేకుండా మారాయని, ఇప్పుడు హైదరాబాద్‌ను పట్టించుకోకపోతే వచ్చే పదేళ్ల తర్వా త  ఢిల్లీ పరిస్థితే ఇక్కడ వస్తుందన్నారు. వచ్చే ఏడాదికి భవిష్యత్ ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  

ఐటీ అభివృద్ధికి పునాదులు 

నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కృష్ణా జలాలనే కాదు.. గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దని.. కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే హైదరాబాద్ నగరంలో తాగు నీటి సమస్య పరిష్కారమైందని సీఎం చెప్పారు. హైదరాబాద్‌కు మెట్రోను తీసుకొచ్చేందుకు ఆనాడు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.  హైదరాబాద్‌లో ఐటీని చంద్రబాబునాయుడు ప్రారంభిస్తే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. ‘రీజినల్ రింగ్ రోడ్డు నుంచి రేడియల్ రోడ్లు నిర్మించి నగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నాం.

ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్‌లో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ట్యాంక్ బండ్‌ను మురికి కూపంగా మార్చింది. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని ప్రజలను మోసం చేశారు. పదేళ్లలో నగరానికి కావల్సిన శాశ్వత అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించింది. దేశంలో ఏ నగరాన్ని చూసినా సమస్యలమయమే.

ఆ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి. హైదరాబాద్ నగరం అలా మారకుండా జాగ్రత్త పడాలి. అందుకే హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవనం జరగాలి. నగరంలో వరదల నియంత్రణకు రోడ్లపై వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం. నగరంలోని 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని అధికారులకు ఆదేశించాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది 

రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎంత విషప్రచారం చేసినా మేం వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ఏప్రిల్, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు మీరు గమనించండి. మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఏప్రిల్ 1, 2024 నుంచి నవంబర్ 30, 2024 వరకు మా పాలనకు తేడా చూడండి.

మా పాలనలో 29 శాతం ఎక్కువ అభివృద్ధి జరిగింది.. రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది తగ్గలేదు. ఇది మా నిబద్ధతకి నిదర్శనం. హైడ్రా చెరువుల ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు పుట్టించింది.’ అని సీఎం చెప్పారు.

ఎన్ని నిధులు తీసుకోస్తావో చెప్పు కిషన్‌రెడ్డి?

‘మూసీ ప్రక్షాళన వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు.  మోదీ కంటే మంచి పేరు వస్తుందనే కిషన్‌రెడ్డి మా కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు. నువ్వు మూసీలో పడుకున్నా.. మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి మూసీ ప్రక్షాళనకు రూ.25 వేల కోట్లు నిధులు తీసుకురా? పేదలపై మొసలి కన్నీరు కార్చొద్దు.

పేదలకు ఇళ్లు కట్టించేందుకు రూ. 10 వేల కోట్లు తీసుకుస్తే.. అందుకు కావాల్సిన భూములను మేం సమకుర్చుతాం, పేదలకు మంచి అపార్ట్‌మెంట్స్ కట్టిచ్చి మంచి భవిష్యత్ ఇద్దాం. మోదీ  గుజరాత్‌కి  గిఫ్ట్ సిటీ తీసుకుపోయిండు. నువ్వు తెలంగాణకు ఏం గిఫ్ట్ తెచ్చినవ్..? రెండో సారి కేంద్రమంత్రి అయిన నువ్వు రాష్ట్రానికి ఏం నిధులు  తీసుకొచ్చినవ్..? సమాధానం చెప్పాలి.

నగరంలో మెట్రో విస్తరణకు రూ.35వేల కోట్లు అవసరం ఉంది.. మీరు ఎన్ని నిధులు తెస్తారో చెప్పండి . గుజరాత్ మెట్రోకు,  చెన్నుకి మెట్రోకు నిధులు ఇచ్చారు.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు ఇవ్వరు..? హైదరాబాద్‌కు తాగునీటికి కోసం గోదావరి జలాల తరలించడానికి  రూ.7వేల కోట్లు కావాలి.  కేంద్రం నుంచి నువ్వు ఎంత తెస్తావ్..?  రీజినల్  రింగ్ రోడ్డుకు, రేడియల్ రోడ్లకు రూ.50 వేల కోట్లు కావాలి. 

కేంద్రం నుంచి నువ్వు ఎన్ని నిధులు తెస్తావ్.. ?, నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.  మీరు ఎన్ని నిధులు ఇప్పిస్తారో జవాబు చెప్పాలి. మోదీ గుజరాత్‌కు నిధులు, ప్రాజెక్టులు తీసుకెళుతుంటే నువ్వు గుడ్లు అప్పగించి చూస్తున్నావు..? మూసీలో పడుకోవడం కాదు.

మోదీని తీసుకొచ్చి మూసీని  చూపించు. పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలుస్తుంది. మూసీ అభివృద్ధి ఎందుకు అడ్డుకుంటున్నారు..? హైదరాబాద్ మరో ఢిల్లీ కావాలా.. ?. మనం ఈ మురికి కూపంలో మగ్గాల్సిందేనా..? తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి ’అని సీఎం అన్నారు. 

నగర అభివృద్ధికి మంత్రివర్గ ఉపసంఘం

నగర అభివృద్ధిని బీఆర్‌ఎస్, బీజేపీలు గూడుపుఠానిగా మారి అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం నిప్పులు చెరిగారు. నగర అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుతో కలిసి మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నట్లు సీఎం తెలిపారు. నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.

రాజకీయ పార్టీలతో పాటు మేధావులు కూడా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చన్నారు.  ‘బీఆర్‌ఎస్,  బీజేపీకి నేను ఈ వేదికగా పిలుపునిస్తున్నా. మీ పాలసీ డాక్యుమెంట్ తీసుకురండి. తండ్రీ, కొడుకులు (కేసీఆర్, కేటీఆర్) పాలసీ డాక్యుమెంట్ తెలంగాణ సమాజానికి చూపండి . సహేతుకమైతే నూటికి నూరు శాతం మీ ప్రతిపాదనతో ముందుకెళ్తాం.

ఇద్దరు గూడుపుఠానితో అడ్డుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మన భవిష్యత్ ప్రణాళిక మనమే సిద్ధం చేసుకుందాం. గోదావరి జలాలు మూసీలో పారాలి. అప్పుడే నగరంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. ఏది చేసినా అడ్డుకుంటామంటే కుదరదు.

తప్పులు, అప్పులు తప్ప గత ప్రభుత్వం చేసిందేం లేదు. మాపై కోపంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను శిక్షించొద్దు. నగర అభివృద్ధిని అడ్డుకోవద్దు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే బాధ్యత మేం  తీసుకుంటాం.’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

యాక్షన్‌ప్లాన్ ఎంటో చెప్పాలి.. 

ప్రపంచం పెట్టుబడులకు హైదరాబాద్ వేదిక కావాలంటే.. ఇక్కడి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  రాష్ట్రానికి నిధులు తెస్తారా..? గుజరాత్‌కు వలస వెళ్లుతారో తేల్చుకోవాలని సీఎం అన్నారు. నగర అభివృద్ధికి కిషన్‌రెడ్డి దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఎంటో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

‘మూసీ ప్రక్షాళనకు మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పండి.. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు నిధులు ఎన్ని తెస్తారో చెప్పండి . హైదరాబాద్ నగరంలో ఫ్లు ఓవర్స్ నిర్మాణానికి మీరు తెచ్చే నిధులు ఎన్ని. కేంద్రమంత్రిగా మీ ప్రతిపాదనలు ఏంటో ప్రజలకు చెప్పు.

మేం ఏం చేసినా అడ్డుకుంటామంటున్నారు. ఆరు నెలలు నేను ఊరుకుంటా.. నీవు ఏం చేస్తావో చెప్పు. మాకు ఎలాంటి భేషజాలు లేవు.  నగర అభివృద్ధికి మోదీ నుంచి రూ. లక్షన్నర కోట్లు తెస్తే పరేడ్ గ్రౌండ్‌లో మీకు సన్మానం చేస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.