24-03-2025 12:20:02 AM
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ప్రధాన పాత్రల్లో వస్తోంది ‘సీఎం పెళ్లాం’ సినిమా. దర్శకుడు గడ్డం రమణారెడ్డి డైరెక్షన్‌లో ఈ చిత్రాన్ని బొల్లా రామకృష్ణ నిర్మిస్తు న్నారు. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి ఇంద్రజ మాట్లాడుతూ.. “చాలా మంది తమ జీవితంలో చూసిన, విన్న, జరిగిన సంఘటనలు మా ‘సీఎం పెళ్లాం’ మూవీలో చూస్తారు” అన్నారు. నటుడు అజయ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. నేను సీఎంగా చేసినప్పటికీ ఈ సినిమా మొత్తం నా భార్యగా నటించిన ఇంద్రజనే ఉంటారు’ అని చెప్పారు.
దర్శకుడు గడ్డం రమణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ హైదరాబాద్ నగరం నేపథ్యంగా రూపొందించాం. మన నగరం ఎలా ఉందో ఈ పాటలో చూపించాం. నేను అమెరికాలో ఉంటాను. కుండపోత వర్షం పడినా చుక్క నీరు నగరంలో నిలవదు. ఇక్కడ వర్షం వస్తే మాత్రం అంతే! నేను ఎవరినీ విమర్శించడం లేదు. నగరం బాగుండాలనే తపనతో చెబుతున్నా. ఒకే ఒక్కడు చిత్రంలో వన్ డే సీఎంను చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం’ అని తెలిపారు.