calender_icon.png 27 November, 2024 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ వస్తే రాజ్యాంగం ఉండదు

18-05-2024 01:22:31 AM

ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలి  

ఇందిరమ్మ హయాంలో వచ్చిన పథకాలే కొనసాగుతున్నాయి 

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం అంతమయ్యే ప్రమాదముందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. బీజేపీకి ఓట్లు వేస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మహారాష్ట్రలోని ధారావీ, సియాన్, కొలివాడ, బ్యాండ్రా తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహారాష్ట్ర గడ్డకు ఒక ప్రత్యేకత ఉందని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, సంఘ సంస్కర్త జ్యోతిబాపూలే ఈ గడ్డమీద పుట్టిన వారేననని పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికీ హక్కులు వచ్చాయన్నారు. మహిళలకు విద్యావకాశాల కోసం జ్యోతిబాపూలే పరితపించారని తెలిపారు. తెలంగాణలో ప్రజాభవన్‌కు జ్యోతిబాపూలే పేరు పెట్టామన్నారు. ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడి, తూ.చ. తప్పకుండా అమలు చేసిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయాలని అనుకుంటోందని, రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తోందని పొంగులేటి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే నిలువ నీడను కోల్పోతారని, కూర్చున్న కొమ్మను నరుకున్నట్లుగానే ఉంటుందని మహారాష్ట్ర ఓటర్లకు వివరించారు.

ప్రతి వస్తువు మీద జీఎస్టీ పేరుతో ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ హయా ంలో వచ్చిన సంక్షేమ పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, మోదీ వచ్చాక పేదలకు చేసిందేమి లేదని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు ఎంతో నమ్మకంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే.. బీజేపీ కూటమిని విచ్ఛిన్నం చేసి అనైతికంగా గద్దెనెక్కిందన్నారు.