వీహెచ్ హాట్ కామెంట్స్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 ( విజయక్రాంతి): దేశంలో వింత పరిస్థితి ఉందని, జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలు ఓట్లు వేస్తే 5 శాతం కూడా లేని ఓసీలు అధికారం చెలాయిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీల ఓట్లతోనే పదవి అనుభవిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి కూడా కాకు ండా ఏకంగా సీఎం అయిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా ఓబీసీ కులగణన చేయాలని కోరుతూ శనివారం శేరిలింగంపల్లిలో ఓబీసీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వీ హన్మంతరావు, మాజీ ఐపీఎస్ పూర్ణచందర్ రావు, మాజీ ఐఏఎస్ చిరంజీవులు పాల్గొన్నారు. వీహెచ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ అందరికీ దేవుడని, ఆయన వల్లనే ఈ కాస్త హక్కులనైనా అనుభవిస్తున్నామని అన్నారు. దేశంలో అతిపెద్ద సమస్య రిజర్వేషన్ల అంశమని, వెంటనే బీసీ కులగణన నిర్వహించి 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఒక్కడే అన్ని క్రెడిట్స్ దక్కించుకుంటున్నారని, బీసీ రిజర్వేషన్లు పెంచి ఆ క్రెడిట్ కూడా దక్కించుకోవాలని సూచించారు.