- ఇన్‌స్టా ఫాలోవర్స్‌కు యూట్యూబర్ ఆఫర్
బౌన్సర్లతో మాల్‌లోకి ఎంట్రీ
శేరిలింగంపల్లి, డిసెంబర్ 28: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా యువ చేసే పిచ్చి చేష్టలు మితిమీరిపోతున్నాయి. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తూన్నారు. ఇటీవలే ఓ వ్యక్తి ఓఆర్‌ఆర్‌పైన డబ్బులు దాచడంతో పాటు అక్కడికి వెళ్లి డబ్బులు తీసుకున్నవారు వీడియో తీసి తన ఇంస్టాగ్రామ్‌కు పోస్టు చేయాలంటూ చేసిన వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ కావడం ఆపై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. తాజాగా అదే తరహాలో శుక్రవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో ఓ వ్యక్తి డబ్బులు సూట్‌కేస్‌తో పాటు బౌన్సర్లతో ఏఎంబీ మాల్‌లో హల్‌చల్ చేశాడు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఏఎంబీ మాల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి దాదాపు ఆరు మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లకి డబ్బులు ఇస్తానంటూ ఏఎంబీ మాల్‌కు త్వరగా రావాలని ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా అడ్రస్ చెబుతున్నాడు. ఈ క్రమంలోనే అతని చుట్టూ చాలామంది తిరుగుతున్నారు. ఈ వీడియో గురించి గచ్చిబౌలి పోలీసులను అడుగగా.. ఆ వీడియో చేసింది వంశీ అనే యూట్యూబర్ అని తెలిపారు. గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ కావాలని కేపీహెచ్‌బీలో రోడ్లపై పైసలు చల్లి హల్‌చల్ చేశాడని తెలిపారు.
అప్పుడు అతడిపై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అతని బుద్ధి మారలేదని అన్నారు. కాగా కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో హల్‌చల్ చేసిన విషయంపై మాకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఇలా పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేసే వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ట్యాగ్ చేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.