హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి మండలం ఖానామెట్- కూకట్‌పల్లి సరిహద్దులోని ఈదులకుంట చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుపై హైడ్రా విచారణ ప్రారంభించింది. ఆ స్థలం తమదే అంటున్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన వారితో పాటు ఫిర్యాదు చేసిన స్థానికులతో ఇటీవల హైడ్రా అధికారులు మాట్లాడారు.
హైటెక్ సిటీ (సైబర్ సిటీ) వద్ద వంతెన నిర్మాణంతో గతంలో తుమ్ముడికుంట, ఈదులకుంట మధ్య ఉన్న వరదకాలువ మూసుకుపోయిందని స్థానికులు వివరించారు. ఆ చెరువులోకి నీరు రాకపోవడంతో మట్టితో నింపి కబ్జాకు పాల్పడ్డారంటూ హైడ్రా అధికారులకు ఆధారాలను చూపినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే సర్వే ఆఫ్ ఇండియా, ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులతో ఈదులకుంట చెరువు ప్రాంతాన్ని సందర్శించిన హైడ్రా ఉన్నతాధికారులు.. ఈదులకుంట చెరువు హద్దుల నిర్దారణకు గురువారం సర్వే పనులకు శ్రీకారం చుట్టారు.
సర్వే ఆఫ్ ఇండియా టోపో మ్యాప్ ప్రకారం గురువారం పూర్తిస్థాయిలో సర్వే చేపట్టారు. ఈ సర్వేలో ఖానామెట్ మధ్యలో ఈదులకుంట చెరువు ఉన్నట్టుగా నిర్ధారించడంతో పాటు ఎఫ్‌టీఎల్, నీటి విస్తరణ ప్రాంతాలను కూడా గుర్తించినట్టు సమాచారం.