సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్...
కామారెడ్డి (విజయక్రాంతి): అసైన్మెంట్ భూములను పట్టా భూములుగా మార్చిన తాహసిల్దార్లపై ఏసీబీ అధికారులు దాడులు చేసి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు సిపిఎం పార్టీ చేసిన ప్రచారంలో భాగంగా తమ దృష్టికి చాలా విషయాలు వచ్చాయని అందులో వివిధ గ్రామాలలో రాజకీయ నాయకులు పలుకుబడి గల వ్యక్తులు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, కుంటలు, చెరువుల భూమిని సైతం కబ్జాలు చేశారన్నారు.
ఇలాంటి వ్యక్తులకు రెవెన్యూ వివిధ మండలాల్లోని తాహసిల్దారుడు కొందరు అధిక డబ్బులు తీసుకొని అసైన్మెంట్ భూములను సైతం పట్టా భూములుగా మార్చిన అధికారులు ఉన్నారని, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించుకున్నారని ఏసీ అధికారులు గుర్తించి అలాంటి వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలన్నారు. దళితులు, పేద రైతులు తమ తండ్రుల పేరుపై ఉన్న అసైన్మెంట్ భూములను తమ పేరుపై మార్చాలని తాహసిల్దార్ కార్యాలయల తిరుగుతున్న వారి పేర్లు మార్చడం లేదని, కొన్నిచోట్ల డబ్బులు తీసుకొని మార్చిన సంఘటనలు మా దృష్టికి వచ్చాయన్నారు. అలాంటి అవినీతి తాహసిల్దార్లను ప్రభుత్వమే గుర్తించాలని బీద రైతు తాహసిల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నరాన్నారు.
అలాంటిది ఏసీబీ కార్యాలయానికి వెళ్లి వారికి ఫిర్యాదు చేయాలంటే అమాయకులైన రైతులకు తెలియదన్నారు. కామారెడ్డి, ఉమ్మడి మాచారెడ్డి తదితర మండలాల్లో చాలా చోట్ల దేవాలయ, ప్రభుత్వ, కుంటలు చెరువుల శిఖం భూములను రాజకీయ నాయకులకు కొందరు తాహసిల్దార్లు పట్ట భూములుగా మార్చి చేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. చాలాచోట్ల కుంటలను కబ్జాలు చేసి అక్కడ వెంచర్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతిరం, కొత్త నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ, అజయ్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.