calender_icon.png 13 January, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక బాధ్యతను గుర్తెరగాలి

24-12-2024 12:00:00 AM

సినిమా రంగం ప్రసార మాధ్యమాలలో ఒకటి. సమాజం ప్రభావిత మయ్యే ఈ మాధ్యమాన్ని ప్రజలు అత్యధికంగా ఆదరిస్తారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చరిత్ర, వర్తమానం, సాహిత్యం, సాంస్కృతిక విషయాలు, మానవ నాగరికత, పౌరాణిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ,సాంఘిక, సామాజిక అభివృద్ధి రంగాలలో ఎదుగుదల ఒక మాటలో చెప్పాలంటే ఈ మాధ్యమం ద్వారా సమస్త సమాచారాన్ని సమాజానికి తెలియజేయవచ్చు.

అయితే ఇది ఒకప్పటి మాట. కానీ నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో  చరవాణి సామాజిక మాధ్యమాలు విపరీతంగా పుట్టుకు వచ్చాయి. వీటి ద్వారా సమాజం తీవ్రంగా ప్రభావితం అవుతోందన్న విషయాన్ని గమనించాలి. ఒకప్పటి సినిమా రంగం నేడు లేదు. నేటి సమాజానికి సినీ రంగం అందిస్తున్న సమాచారం సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంటోదన్న ప్రజాస్వామికవాదులు, ప్రజల వాదనలకు బలం చేకూరుస్తోంది. 

సమాజ హితం కనుమరుగు

1970 దశకంలో మద్రాసు నుండి హైదరాబాద్‌కు రావడం ప్రారంభించిన సినిమా రంగం 1990 నాటికి పూర్తిగా మారిపోయింది. మెల్ల మెల్లగా సినిమా రంగం హైదరాబాద్ చుట్టూ భూములను  సబ్సిడీల పేరుతో కారుచౌకగా లక్షలాది ఎకరాలు కొల్లగొట్టింది. సినిమా రంగంలో మిగులు బడ్జెట్ తో వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం, రాజకీయరం గంలో కూడా పెట్టుబడులు పెట్టడం, రాజకీయాన్ని హస్తగతం చేసుకోవడం ఇవన్నీ ఒక సినిమాగా మన దగ్గర జరిగిన సంఘటనలే.

అయితే ప్రజలు సినిమా రంగాన్ని తన అవసరాల కొరకు మాత్రమే వాడుకోవాలన్న విషయాన్ని ఇంకా గ్రహించకపోవ డానికి నిన్న మొన్న హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు. సినిమా ఓ వినోదం మాత్రమేని,  సినిమా యాక్టర్లు కూడా మామూలు మనుషులే అన్న విషయాన్ని మనం గుర్తెరిగి ఉండాలి.

ప్రజలు సంపాదించిన సొమ్ముతో  సినిమాలు చూస్తే వసూలైన డబ్బుతో  నటులు,  సినిమా యంత్రాంగం సిబ్బంది  కోట్లకు పడగలెత్తుతూ ఉంటే,  ఒక్కొక్క సినిమాకు హీరో  కోట్ల రూపాయలను దర్శక, నిర్మాతల నుండి ఆశిస్తూ ఉంటే  ఆ సినిమా ద్వారా ఏ రకమైన ప్రయోజనం సమాజానికి చేకూరుతుందని ఆలోచన చేయాలి. ఇవేవీ చూడకుండా సెన్సార్ బోర్డు అనుమతించడం, హీరోలకు ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో స్వాగతం పలకడం, జన సమ్మ ర్దం మధ్య తొక్కిసలాట జరిగి కొందరి మృతికి కారణం అవుతుంటే ఈ ఆగడా లు, ఆడంబరాలు ఎవరి కోసం అని చర్చించుకోవలసిన సమయం ఆసన్నమైనది.

సెన్సార్ బోర్డు కథను పరిశీలించదు. ప్రభుత్వం అందులోని లోటుపాట్లను తర చి చూడదు. నిర్మాతలు, దర్శకులు, సిబ్బందికి ఏ రకంగానూ  ప్రజల సంక్షేమం పట్ట దు. వాళ్లకు కావలసింది కేవలం  పెద్ద మొత్తంలో వసూళ్లు, అంతకుమించి అభిమానులను తయారు చేసుకోవడం ద్వారా  ఊరేగాలని ప్రయత్నించడమే. ఈ సమాజ  పురోగతి కోసం సినిమా రంగం ఏ రకంగానూ తోడ్పడిన సందర్భాలు లేవని సమాజం గుర్తించాల్సిన అవసరం  ఉంది. 

పుష్ప2  విడుదలైన సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్  సంధ్యా థియేటర్ లో  హీరో అల్లు అర్జున్ రాక, తొక్కిసలాట  తదనంతర పరిణామాలలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడడం మనందరికీ తెలిసిన విషయమే.  సినిమాలో నటించే హీరోలు  నిజజీవితంలో కూడా హీరోలమేనని, సమాజాన్ని ఉద్ధరించినట్లుగా లక్షలాది మందితో ఫ్యాన్స్ ను ఏ ర్పాటు చేసుకోవడం  వలన సమాజానికి ఒరిగేది ఏమీ లేదు.  నిర్మాణం చేస్తున్న సి నిమాల్లో సమాజ హితాన్ని కోరే కథాంశం  దేనిలోనైనా మనకు కనపడిందా? సినిమా రంగం ఒక్కసారి సమాజ పక్షానఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది.

పరామర్శకు నోచుకోని బాధితులు 

 తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెంది కొడుకు  మరణశయ్య పైన కొట్టుమిట్టాడుతుంటే ఇప్పటికీ  అల్లు అర్జున్ ఆ కుటుం బాన్ని పరామర్శించకపోవడం సిగ్గుచేటు.  25 లక్షలు ప్రకటించినట్లు చెప్పగానే సరిపోదు.  తొక్కిసలాట సంఘటనల నేపథ్యం లో అరెస్ట్ అయిన తర్వాత అదేదో దేశానికి  జరిగిన అనర్థం లాగా కోర్టుకు  పరిగెత్తి  బెయిల్ తెచ్చుకోవడానికి చూపిన శ్రద్ధ  సినిమా నిర్మాణంలో కానీ, సమాజానికి ఉపయోగపడే  ప్రయోజనకరమైన సన్నివేశాలను చూపడంలో కానీ చూపకపోవడం విడ్డూరం.

పైగా సినిమాలో  పోలీసులను అవమానించిన తీరుపైన  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును స్వాగతించవలసిన అవసరం ఎంతగానో ఉంది. అసెంబ్లీలో  చర్చ సందర్భంగా ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి  ఈ ఘటనలపై ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇకముందు బెనిఫిట్ షోలు లాంటి ఏ రకమైన లబ్ధిని సినిమా రంగానికి  చేకూర్చడం జరగదని, ఇలాంటివి  ఇకముందు పునరావృతం కాకూడదని ప్రకటించడం  సినిమా రంగం ఒంటెద్దు పోకడను కట్టడి చేసే క్రమంలో  కొన్ని కఠిన చర్యలుగా భావించాలి.

స్మగ్లింగ్ చేయడం గొప్పా?

 ప్రభుత్వాలు,అధికారులు, పోలీసుల కనుసన్నల్లో  పాలన నడుస్తున్నప్పటికీ వాళ్లందర్నీ తప్పించి ఎర్రచందనం  ఇతర దేశాలకు దొంగతనంగా పంపించడమే ఈ కథలోని  గొప్పతనం అయితే  అది సమాజానికి ఏ రకంగా తోడ్పడుతుందో చెప్పా ల్సిన అవసరం ఉందని నగర పోలీసు కమిషనర్ హెచ్చరించిన తీరును  మనమందరం స్వాగతించవలసిందే.

భవిష్యత్తు లో ఏ రకమైన సినిమా నిర్మాణం చేసినా సెన్సార్ బోర్డు తో పాటు ప్రభుత్వం కూడా అందులో సామాజిక ప్రయోజనం ఉంటే తప్ప అనుమతించకుండా ఉంటేనే  సినిమాల పైన కొనసాగుతున్న పిచ్చి  తగ్గు తుంది. నిర్మాణాత్మకంగా వ్యవహరించవలసిన యువత  సినిమాల బారిన పడి తమ జీవితాలను కోల్పోవడాన్ని కూడా అడ్డుకోవాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి హెచ్చరిక సినిమా రంగానికి కనువిప్పు కావాల్సిన అవసరం వుంది. ముఖ్యమంత్రి ఈ సంఘటన పట,్ల పుష్ప2 సినిమాలోని కథాంశం పట్ల, సినిమాలోని సన్నివేశాల పట్ల స్పందించిన తీరు ఇకముందు కూడా కొనసాగించాలి. 

ప్రస్తుతం నిర్మాణం అవుతున్న సీరియల్స్, వివిధ రకాల సినిమాలలో సామాజిక ప్రయోజనం ఏమాత్రం లేకపోగా కేవలం  కొద్దిమంది దర్శక, నిర్మాతల  ప్రయోజనం కోసం  ప్రజలందరినీ పావులుగా వినియోగించుకోవడం, యువతను, తమ కర్తవ్యాన్ని విస్మరించే వాళ్ళుగా తయారు చేయడం మాత్రం నిజంగా సిగ్గుచేటు. ఈ రకమైనటువంటి అనర్థాలు సమాజంలో వివిధ రంగాల్లో జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు కూడా నిర్లిప్తంగా ఉండడం, సామాజిక బాధ్యతను విస్మరించడం, ఏదో సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా ఒక్కొక్క శాఖకు సంబంధించిన మంచి చెడుల పైన మంత్రి, అధికారులు నిక్కచ్చిగా ఉండి  సమాజానికి ప్రయోజనం చేకూర్చని నిర్ణయాన్ని  నిర్దాక్షిణ్యం గా ఖండించడం,  ఎంతటి వారైనా ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది.

ప్రస్తు త పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పందించిన తీరు  ఇకముందు సినిమా రంగంతో పాటు ప్రతి రంగంలోని అనర్థాలపైన కూడా కొనసాగించడం ద్వారా సామాజిక ప్రయోజనాలను విస్మరించి ప్రజలను పావులుగా వాడుకునే  దుష్టశక్తులను కట్టడి చేయడానికి తోడ్పడుతుంది. ఆ వైపుగా ప్రభుత్వాల ప్రయాణం కొనసాగాలని మనసారా కోరుకుందాం. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీ అనేది కేవలం డబ్బు సంపాదించడం కోసమే అన్న చందనంగా కొనసాగితే ప్రజల ప్రజల మన్ననకు దూరం కాక తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.