calender_icon.png 29 April, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరి ఒత్తిడికి లొంగకుండా రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులను గుర్తించండి

28-04-2025 08:37:39 PM

స్పెషల్ అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): ఎవరి ఒత్తిడికి లోను కాకుండా ఎటువంటి పక్షపాతానికి తావు ఇవ్వకుండా రాజీవ్ యువ వికాసం పథకానికి నిష్పక్షపాతంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులను గుర్తించి కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకొని అర్హులైన వారి జాబితా తయారు చేసే ప్రక్రియలో పాల్గొనాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) స్పెషల్ ఆఫీసర్లకు సూచించారు. సోమవారం ఐటిడిఏ సమావేశం మందిరంలో ఐటిడిఏ స్పెషల్ ఆఫీసర్లతో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన కమిటీలో తీసుకోవలసిన కార్యాచరణపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలో జరిగే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన కమిటీలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకుల దరఖాస్తులను మండల్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీతో గిరిజన నిరుద్యోగ యువతీ యువకుల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన దరఖాస్తుదారుల జాబితా తయారు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ పథకానికి 21,792 మంది గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. 

ప్రస్తుతం వేసవి సెలవులు నడుస్తున్నందున గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో మైనర్ రిపేర్లు కానీ, మేజర్ రిపేర్లు కానీ ఏమైనా ఉంటే మీ పరిధిలోని పాఠశాలలను సందర్శించి వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, ముఖ్యంగా మంచినీరు, టాయిలెట్స్, బాత్రూమ్స్, విద్యుత్ సౌకర్యం, బాలికల పాఠశాలలకు ప్రహరీ గోడ, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా తప్పనిసరిగా ప్రతి పాఠశాలను సందర్శించి మే 31 నాటికి ప్రతిపాదనలు తనకు సమర్పించాలని, పాఠశాలల పర్యవేక్షణ, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక బాధ్యత తీసుకొవాలని, పాఠశాలల పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించే స్పెషల్ ఆఫీసర్లకు శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఆర్.సి.ఓ గురుకులం నాగార్జున రావు, ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.