ఐటీడీఏ పీవో రాహుల్...
బూర్గంపాడు (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు దారిద్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాల వారినీ గుర్తించి అందరికీ అందేలా సంబంధిత రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బి రాహుల్ అన్నారు. గురువారం సారపాక గ్రామపంచాయతీలోనీ పాత సారపాక, కండక్ట్ కాలనీలోని ప్రజా పాలనలో ఈ నాలుగు పథకాల కోసం దరఖాస్తు చేసుకొన్న లబ్ధిదారుల జాబితా ప్రకారము ఆయన పరిశీలించారు. ముందుగా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... నిరుపేదలైన కుటుంబాలకు ఆహార భద్రత కార్డు అందించడానికి ప్రభుత్వం సంకల్పించి నందున ప్రజా పాలనలో రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు చేసుకున్న నిరుపేద కుటుంబాల వారి ఇండ్లకు వెళ్లి రేషన్ కార్డులు సర్వే చేసే సమయంలో ఖచ్చితమైన నిబంధనలు ప్రకారము ఇంటి యజమానులను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతనే పూర్తిస్థాయిలో వారు వివరాలు పొందుపరచాలని, రేషన్ కార్డు అర్హత కొరకు తప్పనిసరిగా పల్లె ప్రాంతాలలో ప్రతి కుటుంబానికి సంవత్సర ఆదాయం రూ.1.50 లక్షలకు మించకూడదని, పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షలు అంతకంటే తక్కువ ఉన్నవారిని, సాగు చేసుకునే పంట భూమి మాగాణి 3.5 ఎకరాలు మెట్ట 7.5 ఎకరాలు లోపు ఉండాలని అలాగే పక్కా ఇల్లు లేని వారు, రోజువారి కూలి పనులు చేసుకుని జీవించే కుటుంబాలు తప్పనిసరిగా అర్హత కలిగిన ఏ కుటుంబం కార్డును కోల్పోకుండా రేషన్ కార్డు జాబితాలో ఉండాలని అన్నారు.
కులగణన సర్వే ఆధారంగా తయారుచేసిన రేషన్ కార్డు లేని పేద కుటుంబాల వారు మాత్రమే ఉండాలని, భూములు, ఆదాయం సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు రెవిన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా గుర్తించాలని, రేషన్ కార్డు ఒకే వ్యక్తికి ఒకచోట మాత్రమే ఉండాలని, పేదలలో అత్యంత అర్హులైన భూమిలేని వ్యక్తులు, వితంతువులు లేదా ఒంటరి మహిళ నేతృత్వంలోని గృహాలు, ప్రాణాంతక అనారోగ్యంతో ఉన్న కుటుంబాలు, హెచ్ఐవి రోగులు, కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు తప్పనిసరిగా గుర్తించాలని అన్నారు. అనంతరం రెడ్డిపాలెంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపాలెం వ్యవసాయ శాఖ ఏవో శంకర్ సెక్రటరీ బాలయ్య, ఏ ఎస్ ఓ ప్రదీప్, సారపాక ఈవో మహేష్ తదితరులు పాల్గొన్నారు.