calender_icon.png 13 January, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుదైన వ్యాధిని గుర్తించండిలా!

02-01-2025 12:00:00 AM

సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కారణం తెలియని వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యాధుల్లో ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) ఒకటి. ఐపీఎఫ్ అంటే కారణం తెలియని వ్యాధి. ఇటీవల ఈవ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మానవ దేహంలో ఊపిరితిత్తులు కీలక పాత్ర పోషిస్తాయి.

ఊపిరితిత్తులు కొన్ని లక్షల గాలి సంచులు లేదా వాయు గోళాల (అల్వియోలై)తో నిర్మించబడుతాయి. వాయుగోళాలు ఆక్సిజన్ లేదా కార్బన్‌డయాక్సైడ్ పరస్పర మార్పిడి కేంద్రాలు. ఐపీఎఫ్ వ్యాధిలో వాయుగోళాలు, వాటి చుట్టూ ఉండే కణజాలాలు మందబడి బిగుసుగా తయారవుతాయి.

మృదువుగా ఉండే కణజాలాలు మందబడటం (స్కారింగ్/ఫైబ్రోసిస్/మచ్చలు బారడం) వల్ల వాయుమార్పిడి సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీంతో శరీరానికి కావల్సినంత ఆక్సిజన్ సరఫరా జరగదు. ఈ పరిస్థితి క్రమేణా మరింత పెరిగి ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తగ్గుతుంది. అవసరమైన స్థాయిలో శరీరానికి ఆక్సిజన్ సరఫరా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అయితే ఆక్సిజన్ సరిపడా అందనప్పుడు శరీరంలో వివిధ అవయవాలు తమ విధులు నిర్వర్తించలేవు. 

ఈ వ్యాధి లక్షలో 20 మందికి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. లక్షణాలు కనిపించనప్పటికీ వ్యాధిని గుర్తించేందుకు ఒకటి నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. టీబీ, ఐపీఎఫ్ లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల వ్యాధిని నిర్ధారించడం కష్టంగా మారుతోంది.

ధూమపానం చేసే అలవాటు ఉన్నవారిలో, 50 సంవత్సరాలు దాటినవారిలో, గతంలో కుటుంబంలో ఎవరికైన ఈ వ్యాధి సోకిన వారిలో ఐపీఎఫ్ వచ్చే ప్రమాదం ఉంది. దుమ్ము ధూళి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, లోహ, కలప ధూళి ప్రాంతాల్లో నివసించే వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. వైరల్ ఇన్ఫెక్షన్, జీర్ణకోశ వ్యాధులు వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు.

ఈ లక్షణాలు క్రమేణా పెరిగి శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. రోజువారీ పనులు కూడా నిర్వర్తించలేని స్థితి వస్తుంది. చివరికి ప్రాణాంతకంగా మారుతుంది. రెండు వారాల కన్నా ఎక్కువగా పై లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 

నిర్ధారణ: ఊపిరితిత్తులు స్కాన్, రక్త పరీక్షలు, ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, నడక సామర్థ్య పరీక్ష, బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.

చికిత్స: వివిధ రకాల మందులు ప్రయోగాత్మకంగా వాడుతున్నప్పటికీ కచ్చితమైన చికిత్సా విధానం అందుబాటులో లేదు. కృత్రిమంగా ఆక్సిజన్ అందించడం ద్వారా వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చు. అరుదైన కేసుల్లో మత్రమే ఊపిరితిత్తుల మార్పిడి చేస్తారు. 

లక్షణాలు

1. శ్వాసలో ఇబ్బంది

2. పొడి దగ్గు

3. ఆయాసం

4. ఆకస్మికంగా బరువు కోల్పోవడం

5. కండరాలు, కీళ్ల నొప్పులు 

6. చేతి, కాలి వేళ్ళు గుండ్రంగా మారడం  

7. ఆకలి మందగించడం

8. ఉమ్మిలో తెమడ

9. దగ్గినప్పుడు రక్తం పడటం

10. ఛాతీలో నొప్పి

11. గురక

 డాక్టర్ అనుమాండ్ల వేణు గోపాలరెడ్డి, 

మైక్రో బయాలజిస్ట్

9948106198