calender_icon.png 13 January, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు బ్యాంక్‌గా మారిన ప్రభుత్వ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్

12-01-2025 12:00:00 AM

పరిశ్రమలకు రుణాలిచ్చే ఆర్థిక సంస్థగా 1964లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా  ఏర్పాటుచేసిన ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)  తదుపరికాలంలో సబ్సిడరీగా ఐడీబీఐ బ్యాంక్ అనే  వాణిజ్య బ్యాంక్‌ను నెలకొల్పింది. ఐడీబీఐ చట్టాన్ని పార్లమెంటులో సవరించడం ద్వారా 2005లో ఐడీబీఐ బ్యాంక్‌లోకి మాతృసంస్థ ఐడీబీఐని విలీనం చేసి ‘ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్’ అనే క్యాటగిరీలో ఉంచారు. 

ఎల్‌ఐసీ నేతృత్వంలో నిర్వహణ

అధిక ఎన్‌పీఏలు, క్యాపి టల్ అడిక్వసీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఐడీబీఐ బ్యాంక్‌లోకి మూలధన పెట్టుబడులు చేయడంతో ఆ బ్యాంక్‌ను నిర్వహించాలంటూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్రం ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంక్‌లో కొంతవాటాను విక్రయించడంతో ఈ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 51 శాతం మెజారిటీ వాటా సమకూరింది.

దీనితో 2019లో రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం రిజర్వ్‌బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్‌ను ‘ప్రైవేటు రంగ బ్యాంక్’ క్యాటగిరీలోకి మార్చింది. అలా ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటు రంగ బ్యాంక్‌గా రూపాంతరం చెందింది. వాస్తవానికి ఇది ప్రైవేటు బ్యాంక్ అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్షం గా, పరోక్షంగా (ఎల్‌ఐసీ ద్వా రా) ఐడీబీఐ బ్యాంక్‌లో ప్ర స్తుతం 85 శాతం వాటా ఉన్నది.

సిడ్బి, ఎగ్జిమ్ బ్యాంక్, ఎన్‌ఎస్‌ఈ, నేషనల్ సె క్యూరిటీస్ డిపాజిట రీ తదితర సం స్థలకు ఐడీబీఐయే ప్రారంభ మూలధనాన్ని సమకూర్చింది. దీనితో ఈ సంస్థలన్నింటిలోనూ ప్రస్తుత ఐడీబీఐ బ్యాంక్‌కు వాటాలున్నాయి. 

2,036 శాఖలు.. రూ.3.63 లక్షల కోట్ల ఆస్తులు

ఐడీబీఐ బ్యాంక్‌కు  2024 సెప్టెంబర్ నాటికి  దేశవ్యాప్తంగా 2,036 శాఖలు ఉన్నా యి. 3,269 ఏటీఎంలను నిర్వహిస్తున్నది. 2024 సెప్టెంబర్ నాటికి ఈ  బ్యాంక్‌లో 20,078 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐడీబీఐ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.3,63,190 కోట్లు. 

ఆస్తుల రీత్యా ప్రైవేటు బ్యాంక్‌ల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ తర్వాత ఐడీబీఐ బ్యాంక్ ఏడవ స్థానంలో ఉన్నది.  ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రస్తుతం ఎంఆర్ కుమార్ చైర్మన్‌గా రాకేశ్ శర్మ ఎండీ, సీఈవోగా  వ్యవహరిస్తున్నారు. 

రూ.74,653 కోట్ల  మార్కెట్ విలువ

స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే ఐడీబీఐ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.74,653 కోట్లు.  ప్రైవేటు బ్యాంక్‌ల్లో ఆస్తుల్లో ఏడవ స్థానంలో ఉన్న ఐడీబీఐ బ్యాంక్ మార్కెట్ విలువలో మాత్రం ఆరవ స్థానంలో ఉన్నది. ఈ షేరు గత మూడేండ్లలో 34 శాతం రాబడిని ఇచ్చింది.