న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంక్ స్టాండెలోన్ నికరలాభం ఈ జూలై-సెప్టెంబర్ ద్వితీయ త్రైమాసికంలో 14.5 శాతం వృద్ధిచెంది రూ. 11,746 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో బ్యాంక్ రూ. 10,261 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికరలాభం 19 శాతం పెరిగి రూ. 10,896 కోట్ల నుంచి రూ. 12,948 కోట్లకు చేరింది.
మొత్తం ఆదా యం రూ. 40,697 కోట్ల నుంచి రూ. 47,714 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం స్టాక్ ఎక్సేంజ్‌లకు సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. బ్యాంక్ వడ్డీ ఆదాయం రూ.40,537 కోట్లకు పెరగ్గా, నికర వడ్డీ ఆదాయం 9.5 శాతం వృద్ధిచెంది రూ. 18,308 కోట్ల నుంచి రూ. 20,048 కోట్లకు చేరింది.
ఆస్తుల నాణ్యతకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 2.48 శాతం నుంచి 1.97 శాతానికి తగ్గా యి. నికర ఎన్‌పీఏలు 0.43 శాతం నుంచి 0.42 శాతానికి మెరుగుపడ్డాయి. బ్యాంక్ సబ్సిడరీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్ లాభం రూ. 252 కోట్లకు, జనరల్ ఇన్సూరెన్స్ యూనిట్ లాభం రూ.694 కోట్లకు పెరిగింది. అసెట్ మేనేజ్‌మెంట్ సబ్సిడరీ లాభం రూ. 691 కోట్లకు చేరింది.