దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత రిజర్వ్ బ్యాంక్ నుంచి లైసెన్సులు పొందిన బ్యాంక్‌లు కొత్త టెక్నాలజీతో, అత్యాధునిక బ్యాంకింగ్ సేవలతో కార్యకలాపాలు ప్రారంభించినవి నవతరం బ్యాంక్‌లుగా ప్రసిద్ధి పొందాయి. ప్రభుత్వ సంస్థ అయిన ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐసీఐసీఐ) 1990వ దశకంలో పలు సబ్సిడరీలను ప్రారంభించింది.
అందులో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ 1994లో గుజరాత్‌లోని వడోదరలో కార్యకలాపాలు ప్రారంభించింది. నవతరం బ్యాంక్‌గా ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ బ్యాంక్ 1998లోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు, త్రి ఇన్ ఒన్ డిపాజిట్లకు (పొదుపు ఖాతా, ట్రేడింగ్ ఖాతా, డీమ్యాట్ ఖాతా) శ్రీకారం చుట్టింది. ఆ ఏడాదే ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఐసీఐసీఐ తనకున్న వాటాలో కొంతభాగాన్ని పబ్లిక్ ఇష్యూ ద్వారా ఇన్వెస్టర్లకు విక్రయించింది.
దీంతో దేశీయ స్టాక్ ఎక్సేంజీల్లో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లిస్టయ్యాయి. అటుతర్వాత 2000వ సంవత్సరంలో అమెరికన్ డిపాజిటరీ రీసీట్స్ (ఏడీఆర్‌లు) జారీచేసి, న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో (ఎన్‌వైఎస్‌ఈ) ఐసీఐసీఐ బ్యాంక్ లిస్టయ్యింది. దీనితో ఎన్‌వైఎస్‌ఈలో లిస్టయిన తొలి భారతీయ కంపెనీగా ఘనత సాధించింది. అంతేకాకుండా ఆసియాలోకెల్లా (జపాన్ మినహా) ఎన్‌వైఎస్‌ఈలో లిస్టయిన తొలి బ్యాంక్‌గా పేరొందింది.
విలీనమైన మాతృసంస్థ
స్వయానా మాతృసంస్థ అయిన ఐసీఐసీఐ కొత్త శతాబ్దిలో తాను నెలకొల్పిన సబ్సిడరీ ఐసీఐసీఐ బ్యాంక్‌లో విలీనమైపోయింది. 2001 అక్టోబర్‌లో ఐసీఐసీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డులు ఐసీఐసీఐని, దాని రిటైల్ ఫైనాన్స్ సబ్సిడరీలు ఐసీఐసీఐ బ్యాంక్‌తో విలీనం చేయాలని నిర్ణయించాయి. దీనితో అప్పటివరకూ ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థగా ఉన్న ఐసీఐసీఐని పార్లమెంటు చట్ట ఆమోదం ద్వారా ప్రైవేటీకరించినట్లయ్యింది. 6,613 శాఖలు..
రూ.23.64 లక్షల కోట్ల ఆస్తులు
ఐసీఐసీఐ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,613 శాఖలు ఉన్నాయి. 66,120 ఏటీఎంలను నిర్వహిస్తున్నది. 2024 మార్చినాటికి ఐసీఐసీఐ బ్యాంక్‌లో 1,35,900 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.23.64 లక్షల కోట్లు. ఆస్తుల రీత్యా దేశంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ తృతీయస్థానంలో నిలిచింది. దేశంలో వ్యవస్థాపరంగా అతిముఖ్యమైన బ్యాంక్‌లుగా ఈ మూడు బ్యాంక్‌లను ఆర్బీఐ గుర్తించింది.
విదేశీయులు పెట్టుబడులకు మక్కువ చూపించేది అయినందున, ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు 46.22 శాతం వాటా ఉన్నది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల వద్ద 44.44 శాతం, పబ్లిక్ చెంత 9.34 శాతం చొప్పున వాటా ఉన్నది. ఈ బ్యాంక్‌కు ప్రస్తుతం సందీప్ భక్షి ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయం ముంబైలోనూ ఉన్నాయి.
రూ.9.37 లక్షల కోట్ల విలువ
స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.9,37,686 కోట్లు. గతవారమే రూ.1,347 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయిని నమోదుచేసిన ఐసీఐసీఐ బ్యాంక్ షేరు గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 32 శాతం రాబడుల్ని అందించింది.