- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- మంత్రులతో కలిసి ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన
ఖమ్మం, జనవరి 13 (విజయక్రాంతి): ఆయకట్టుకు సత్వరమే నీరందించేలా యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
సోమవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో రూ.66.33 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంచుకొండ ఎత్తిపోతల పథకం కింద 2,400కు పైగా ఎకరాల ఆయకట్టు సాగునీరు అందుతుందన్నారు. జనవరి 26 నుంచి నాలుగు పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో వ్యవసాయం ప్రాధాన్యతగా ఉన్నదని, వ్యవసాయయాధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక ప్రకారం పని చేయాలని భట్టి విక్రమార్క సూచించారు.
అపర భగీరథుడు తుమ్మల: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి కోమటిరెడ్డి వెంకట్‌రెడి మాట్లాడుతూ .. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అపర భగీరథుడని చెప్పారు. ఆయన ప్రత్యేక కృషితో మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారని చెప్పారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ప్రతి ఎకరానికి సాగునీటిని సరఫరా చేసేందుకు పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
తక్కువ ఖర్చు ప్రాజెక్టులకు ప్రాధాన్యత: ఉత్తమ్
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. నేడు ఖమ్మం జిల్లా నాయకులు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, ముఖ్యమైన శాఖలన్నీ ఖమ్మంలోనే ఉన్నాయని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు కొత్త పనులను చేపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.
26న నాలుగు పథకాలు: పొంగులేటి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మరో నాలుగు పథకాలను ఈ నెల 26న ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ పాలకులు తెలంగాణను అప్పుల కుప్పగా చేసినా.. తాము రూ.కోట్లలో వడ్డీలు చెల్లిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రఘురామరెడ్డి, బలరాంనాయక్, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, రాగమయి, ఆదినారాయణ పాల్గొన్నారు.
‘గోదావరి’తో సస్యశ్యామలం: తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాబోయే వానాకాలం నాటికి పనులు పూర్తి చేసి, కాల్వల ద్వారా రైతులకు సాగునీరు అందించే బృహత్తర బాధ్యతను సాగునీటి శాఖ మంత్రి తీసుకున్నారని అన్నారు. జూలూరుపాడు టన్నెల్ కూడా పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు గోదావరి జలాలు వస్తాయని అన్నారు.