దుబాయ్: బంగ్లాదేశ్ బౌలర్ తంజీమ్ హసన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్‌తో తంజీమ్ హసన్ దురుసుగా ప్రవర్తించాడు. అతడి ప్రవర్తనపై సీరియస్ అయిన ఐసీసీ తంజీమ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. మ్యాచ్‌లో మూడో ఓవర్ ముగిసిన అనంతరం రోహిత్ దగ్గరకు వెళ్లిన తంజీమ్ కావాలని అతడిని ఢీకొట్టి అనంతరం కవ్వించే మాటలతో దురుసుగా ప్రవర్తించాడు. నిబంధనలను ఉల్లఘించినందుకు గానూ తంజీమ్ మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నట్లు రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ప్రకటించాడు. ‘ఐసీసీ నిబంధన ఆర్టికల్ 2.12 ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ప్లేయర్.. సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, అంపైర్లు, మ్యాచ్ రిఫరీతో దురుసుగా ప్రవర్తిస్తే జరిమానా తప్పదు’ అని ఐసీసీ ప్రతినిధి తెలిపారు.