చాంపియన్స్ ట్రోఫీ :
దుబాయ్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న సంధిగ్దతపై ఒక స్పష్టత రానుంది. ఈ నెల 29న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఐసీసీతో పాటు బీసీసీఐ, పీసీబీ కూ డా హాజరుకానున్నాయి. సమావేశం అనంతరం టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది.
పాక్‌లో జరగను న్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తాము ఆడేది లేదని భారత్ ఇదివరకే స్పష్టం చే సింది. ఆ తర్వాత బీసీసీఐ హైబ్రీడ్ మోడ్ లో ఆడతామని పేర్కొనగా పాక్ దానికి ససేమీరా అనడంతో ట్రోఫీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాక్‌లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు శతవి ధాల ప్రయత్నిస్తోన్న పీసీబీ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పరిధిలో ట్రోఫీ టూర్‌ను నిర్వహించాలని భావించింది.
దీనికి బీసీసీఐ అభ్యంతరం చెప్పడంతో ఐసీసీటూర్ ప్రదర్శనను వాయిదా వేసింది. అయితే చాంపియన్స్ ట్రోఫీ ఎలాగైనా పాక్‌లోనే జరగాలని పట్టుబట్టిన పీసీబీని హైబ్రీడ్ మోడ్‌లో జరిగేలా ఒప్పించేందుకు ఐసీసీ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. కాగా డిసెంబర్ 1న జై షా ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.