calender_icon.png 1 November, 2024 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్రహీంపట్నం.. ‘ప్రగతి’ రాట్నం

07-07-2024 02:20:18 AM

  • మారనున్న మున్సిపాలిటీ రూపురేఖలు 
  • పెద్ద చెరువు కేంద్రంగా ‘లేక్ ఫ్రంట్ ఏరియా’ గ్రోత్ కారిడార్ 
  • 3,500 ఎకరాల భూమి సేకరించాలని లక్ష్యం 
  • మరోచోట ‘డిస్నీల్యాండ్’ ఏర్పాటుకు 5 వేల ఎకరాల సేకరణ 
  • హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రక్రియ

రంగారెడ్డి, జూలై 6 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నానికి మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర రాజధానికి కేవలం కూతవేటు దూరంలో ఈ ఊరి రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నది. ఊరి శివారులోని పెద్ద చెరువు కేంద్రంగా ఐబీపీ లేక్ ఫ్రంట్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఏండీఏ) ఆ పనుల్లో నిమగ్నమైంది. మరోవైపు దండు మైలారంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుకు 5 వేల ఎకరాల భూసేకరణకు కసరత్తు ప్రారంభించింది. ఇబ్రహీంపట్నం తో పాటు ఖల్సా, భగాయత్, చర్ల పటేల్‌గూడ, కప్పపహాడ్, పోచారం, తుర్కగూడ గ్రామాల పరిధిలోని భూములను సేకరించేందుకు సర్కార్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. హెచ్‌ఎండీఏ అధికారులు ఇప్పటికే బృందాలుగా ఏర్పడి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూ సేకరణ..

ల్యాండ్ పూలింగ్ స్కీం కింద హెచ్‌ఎండీఏ అధికారులు భూసేకరణ చేపట్టను న్నారు. స్కీం కింద 3,500 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగాపెట్టుకున్నారు. లక్ష్య సాధన తర్వాత అధికారులు హెచ్‌ఎండీఏ పరిధిలో భూములను లే ఔట్లుగా మారుస్తారు. భూమి ఇచ్చిన రైతులకు పరిహారం కింద లేఔట్‌లో 1,740 గజాల స్థలం, అసైన్డ్ భూమి అయితే 600 గజాల స్థలాన్ని అప్పగిస్తారు. ప్రాజెక్టు సమీపంలో 95 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ హబ్‌తో పాటు 100 ఎకరాల్లో హైరైజింగ్ బిల్డింగ్ అందుబాటులోకి రానున్నది.

ఓఆర్‌ఆర్, రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పలు విద్యా సంస్థలు, రంగారెడ్డి కలెక్టరేట్ ఉండటంతో భవిష్యత్తులో ఆ ప్రాంతం మరో హైటెక్ సీటీ, నానక్‌రాం గూడను తలదన్నెలా మారుతుందనడంలో సందేహం లేదు. ఎన్నికల కోడ్ కారణంగా భూ సేకరణ కొంత నెమ్మదించినప్పటికీ, ఇకపై వేగవంతం కానున్నది. మేజార్టీ పట్టాదారు యజమానులు, అసైన్డ్ రైతులు స్వచ్ఛందంగా భూములను అప్పగించేందుకు ముందుకు వస్తున్నారు. 

పరిహారం పెంచాలని డిమాండ్లు..

భూమి అప్పగిస్తే వచ్చే పరిహారాన్ని ప్రభుత్వం పెంచాలని రైతులు ప్రతిపాదనలు తెరమీదకు తెస్తున్నారు. కొందరు దళారులు భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే నష్టపోతారని ఆందోళనకు గురిచేస్తున్నారు. తద్వారా ఆ భూములను చౌకగా రైతుల నుంచి కాజేయాలని చూస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా భూసేకరణపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. చెరువు సమీపంలో కన్జర్వేషన్ జోన్ ఉండటంతో ఆ భూముల్లో అనుమతులు లేకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని, హెచ్‌ఎండీకు భూములు అప్పగిస్తే భవిష్యత్తులో మరిన్ని లాభాలు ఉంటాయని చెప్తున్నారు. ప్రాజెక్టు ద్వారా సుమారు లక్షమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, సుమారు 7 లక్షల మందికి గూడు సమస్య ఉండదని స్పష్టం చేస్తున్నారు.

పెద్ద చెరువు దశ మారును..

ఈర పట్నం పెద్ద చెరువు, చిన్న చెరువు కలిపి సూమారుగా 1,45ం ఎకరాల పరిధిలో ఉంటాయి. ప్రభుత్వం చెరువు చుట్టూ 15 కి.మీ మేర ఫుడ్ స్టాళ్లు, సైకిల్ ట్రాక్, టాయ్ ట్రైన్ ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కులను  సైతం ఏర్పాటు చేయనున్నది. భవిష్యత్తులో రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ జిల్లాల ప్రజలకు  ఈ ప్రాంతం టూరిజం స్పాట్‌గా మారనున్నది. తద్వారా సమీప గ్రామాలకు చెందిన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. అలాగే దండుమైలారంలో మరో 5 వేల ఎకరాల్లో డీస్నీ ల్యాండ్ ఏర్పాటు కానుంది. దీని ఏర్పాటుకు ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది.

రైతుల సమ్మతితోనే భూసేకరణ..

ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా రైతుల నుంచి భూమి సేకరిస్తున్నాం. ఇప్పటికే ఐదు గ్రామాల్లో అధికారుల బృందం పర్యటించింది. రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించాం. గ్రామా ల వారీగా ల్యాండ్ పూలింగ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నాం. ఇప్పటికే కొందరు  రైతులు అసైన్డ్ భూములను ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. పట్టభూములు ఉన్న వారు కూడా భూములు ఇచ్చేందుకు ఒప్పుకొంటున్నారు. భూముల ధరలను దృష్టిలో పెట్టుకొని పరిహారం పెంచాలని రైతులు కోరుతున్నారు. నిబంధనల మేరకు వారి ప్రతిపాదనలను పరిశీలిస్తాం.

 మహమ్మద్ అసదుల్లా, అడిషనల్ కలెక్టర్ (ల్యాండ్ పూలింగ్), హెచ్‌ఎండీఏ