calender_icon.png 15 October, 2024 | 5:53 AM

మమ్మల్ని పంపొద్దు

15-10-2024 03:41:11 AM

డీవోపీటీ ఆదేశాలను రద్దు చేయండి

అభ్యర్థనల తిరస్కరణపై క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు

తెలంగాణలోనే ఉంటామంటూ నలుగురు: వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణిప్రసాద్, రొనాల్డ్‌రాస్ 

ఏపీలోనే ఉంటామని ఒకరు: సృజన 

నేడు విచారణ

1. ఆమ్రపాలి

2.  వాకాటి కరుణ

3. వాణిప్రసాద్

4. రొనాల్డ్‌రాస్

5. సృజన

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన కేటాయింపులను పునఃపరిశీలించాలంటూ చేసిన అభ్యర్థనలను తిరస్కరిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఈనెల 9న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులు సోమవారం కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్ర యించారు.

జనవరిలో హైకోర్టు ఇచ్చి న ఆదేశాలమేరకు అధికారుల అభ్యర్థలను పరిశీలించిన తర్వాతే వాటిని తిరస్కరిస్తూ ఈనెల 9న గత కేటాయింపులనే ఖరారు చేయడాన్ని తెలం గాణలో పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్ అధికారులు, ఏపీలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారు లు వాకాటి కరుణ, కే ఆమ్రపాలి, ఏ వాణిప్రసాద్, డీ రొనాల్డ్ రాస్, ఏపీ లో పనిచేస్తున్న జీ సృజనలు క్యాట్‌ను ఆశ్రయించారు. కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వీరంతా సోమవారం అత్యవసరంగా పిటిషన్లు దాఖ లు చేశారు.

తెలంగాణలో పనిచేస్తూ పిటిషన్లు వేసిన నలుగురు ఏపీకి కేటాయింపు చేయడాన్ని, ఏపీలో పని చేస్తూ తెలంగాణకు కేటాయింపు జరి గిన ఒకరు (సృజన) దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ చేపడతామని క్యాట్ ధర్మాసనం ప్రకటించింది. ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీచేయాలని, కేంద్రం జారీచేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరారు.

కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. పదోన్నతులపై ఆలిండియా సర్వీసులోకి వచ్చినవారికి, నేరుగా నియమితులైనవారికి ఎలాంటి తేడా చూపలేదన్నారు. అధికారుల అభ్యర్థనలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించినప్పటికీ ఆపని చేయకుండా బాధ్యతను ఏకసభ్య కమిటీకి అప్పగించిందని తప్పుపట్టారు.

ఐఏఎస్ అధికారులు ఏ రాష్ట్ర క్యాడర్‌కు కేటాయించాలనే వ్యవహారంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఏకసభ్య కమిటీకి అప్పగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఏకసభ్య కమిటీ సిఫారసుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిటీ నివేదికను ఇవ్వకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

కేటాయింపులపై నిర్ణయం తీసుకునే ముందు ఇప్పటికే 10 ఏళ్లుగా ఆయా రాష్ట్రాల్లో అందిస్తున్న సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు సూచనను కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడం చట్టవిరుద్ధమని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణిప్రసాద్, రోనాల్డ్ రాస్ ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంది.

రాష్ట్ర విభజన సందర్భంగా ఆలిండియా అధికారుల కేటాయింపులకు సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జరిగిన కేటాయింపులను సవాల్ చేస్తూ 14 మంది ఆలిండియా సర్వీసు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు చెల్లవని, వాటి ఆధారంగా ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని అప్పట్లో క్యాట్ తీర్పు వెలువరించింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2017లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఇందులో భాగంగా మొదట అప్పటి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు చెందిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు సబబేనని, సోమేష్‌కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పు వెలువరించింది.

అయితే సోమేష్‌కుమార్ కేసులో తీర్పు ఆధారంగా తమ పిటిషన్లపై నిర్ణయం తీసుకోరాదని, వాటిపై ప్రత్యేకంగా విచారించాలని మిగిలిన అధికారులు హైకోర్టును కోరారు. దీంతో 10 మంది ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్‌లకు అనుకూలంగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి కేటాయింపుల వివాదంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు జనవరి 2న ఆదేశాలు జారీచేసింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం గతంలోని కేటాయింపు ఉత్తర్వులను సమర్ధిస్తూ వాటిని అమలు చేయాల్సిందేనని ఆదేశాలను వెలువరించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ తిరిగి ఐదుగురు ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు.