రాహుల్ నోట 'భద్రాద్రి ప్రశస్తి'
కవిత రూపంలో జిల్లా ఖ్యాతి వర్ణన...
ఏరు ఉత్సవాల్లో ఆకట్టుకున్న ఐఏఎస్ కవితా సంకలనం..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అపర విజ్ఞానవంతులే ఐఏఎస్ లు అవుతారన్నది అక్షర సత్యం. ఈ ఐఏఎస్ ఉన్నత ఆఫీసరే కాదు... స్వయంగా కవిగా కూడా మారారు. తెలుగులో ఎంచక్కా కవితలు సంధిస్తూ వీక్షితులను ఆకట్టుకుంటున్నారు. ఆయనే భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ యువ ఐఏఎస్ ఆఫీసర్ పి.ఓ బి. రాహుల్(ITDA Project IAS Officer PO B. Rahul). భద్రాచలం ఐటీడీఏ పిఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఓవైపు గిరిజన ప్రగతికి పెద్దపీట వేస్తూ, మరోవైపు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ తనదైన శైలిలో ప్రత్యేక మార్క్ చూపిస్తున్నారు, ఈ ఐఏఎస్ ఆఫీసర్ గిరి బిడ్డల తెలుగు ప్రజ్ఞకు పదును పెడుతుండటంతో పాటు, గిరిజన ఆచార సంప్రదాయాలు ఉట్టిపడేలా గిరిజన మ్యూజియమును అంద చందంగా తీర్చిదిద్దటంలో కీలక భూమిక పోషించారు.
అంతేకాదు ఇటీవల భద్రాచలంలో జరిగిన ముక్కోటి ఏరు ఉత్సవాల సమయంలో 'భద్రాద్రి ప్రశస్తి' కవిత రూపంలో వివరించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. ఈ కవితలో జిల్లాకు సంబంధించిన అనేక ముఖ్యమైన వాటి గురించి గొప్పగా పేర్కొనడం జరిగింది. జిల్లాకు వాటితో ఉన్న పెనుబంధం గురించి అద్భుత వర్ణన చేయడం జరిగింది. తన తల్లిదండ్రులు స్వయంగా టీచర్లు కావటం, తన సహచరి కూడా బోధనావృత్తిలో ఉండటం, స్వయంగా పిఓ రాహుల్ కు కూడా తెలుగుపై ప్రత్యేక పట్టు ఉండటం గమనార్హం. భద్రాచలం ఐటిడిఏ పిఓ గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్... అన్ని రంగాల్లో తనదైన శైలిలో ముద్ర వేస్తూ... గిరి ప్రగతికి పాటుపడుతున్నారు...
ఇటీవల ఐటీడీఏ పీవో రచించిన భద్రాద్రి ప్రశస్థి కవిత... భద్రాద్రి ప్రశస్త
నల్ల బంగారం సిరులు పురుడు పోసిన గడ్డలో (సింగరేణి బొగ్గు గనులు)
మాగాణపు మాణిక్యాల నిధుల కొనలో (సారవంతమైన పొలాలు)
అడవి తల్లి హరిణి కూనల బుడిబుడి అడుగులలో (జింక పిల్లలు)
కిన్నెరసాని ఏటి దీపుల ఆహ్లాద పడవ ప్రయాణాలలో
కనకగిరుల ప్రకృతి రమణీయతలు కాంచు కాలినడకల మార్గాలలో
పర్ణశాల యందు పరిడవిల్లు తున్న పారవశ్యపు పవిత్ర కుటీరలలో
అరుదైన అటవీ ఉత్పత్తులు అడుగడుగునా అందేటి అంగళ్ళతో (ఇప్ప, కరక్కాయ, అడవి తేనె)
భారజాల లోహ కాగితపు పరిశ్రమల వెలుగు జిలుగులతో (జెన్కో, ఐటిసి, నవభారత్)
మట్టి గోడల వెదురు గుంజల తాటాకు తడికల నివాసాలతో
అత్యంత వినయం ఆభరణంగా, అసమాన ధైర్యమే ఆయుదంగా గల మా ఆదివాసీల అడ్డయైన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదారి ఏటి ఒడ్డున తేప్పోత్సవ ఏరు పండుగకు స్వాగతం...
ఓ సీతారామ,
నీ దశదిన దశావతార సాక్షాత్కారాలు, మా భక్తకోటికి వరమాలికలై
నీ చెంత పుణ్య స్నానాలే, నానా పాపాలకు విముక్తి మార్గములై
నీ సన్నిధిలో నిలవడమే, మా జన్మజన్మల పుణ్యఫలములై
నీ యెడల విశ్వాసమే, కష్టాల కడలిలో మాకు దారి చూపే దిక్సూచియై
విధుల వెంట నీ వేగిరమైన నడక, మా ఇంటి ముంగిట మాకో ధన్యమైన వేడుక
త్రయంబక తనూజ ప్రవాహపు పదనిసలే, సహస్త్రనామ స్తోత్రములుగా
నీ హంస వాహన విహరింపే, మాకు ముల్లోక ప్రదర్శన భాగ్యంగా
నీ ఉత్తర ద్వార దర్శన మహాభాగ్యమే, మాకు దేవదేవతల ఆశీర్వచనంగా
ఓ దశరథ పుత్ర కోశలేంద్ర జానకి వల్లభ, పురుషోత్తమ, రఘునందన, రాఘవ, రామచంద్ర ప్రభూ,
నీ అంగరంగ వైభవమైన ముక్కోటి అధ్యయనోత్సవ శుభ ఘడియల వేళ, ఈ ఆబాల గోపాలాన్ని అనుగ్రహించవయ్యా !!!