తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఐఎఎస్ అధికారుల బదిలీ వ్యవహారంలో సదరు అధికారులకు అన్ని దారులు మూసుకుపోయి నట్లయింది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన అధికారులు సంబంధిత రాష్ట్రాలకు వెళ్లి తీరాల్సిందేనంటూ ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల నిలుపుదల కోసం ఉభయ రాష్ట్రాల్లోని దాదాపు 10 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో వీరంతా సంబంధిత రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
వీరంతా పదేళ్ల క్రితం అంటే రాష్ట్ర విభజన సమయంలో వేర్వేరు రాష్ట్రాలకు కేటాయించబడినప్పటికీ వివిధ కారణాల వల్ల తమకిష్టమైన రాష్ట్రాల్లో పని చేస్తూ వస్తున్నారు. అయితే వీరంతా తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లిపోవాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ(డీఓపీటీ) గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 లోగా సంబంధిత రాష్ట్రా ల్లో విధుల్లో చేరాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
వీరిని తక్షణం రిలీవ్ చేయాలని రెండు రాష్ట్రాల సీఎస్‌లను ఆదేశించింది. అయితే పదేళ్లు పని చేసినందున తమను ఇక్కడే కొనసాగించాలంటూ తెలంగాణకు చెందిన అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో తాము గతంలోనే తీర్పుఇచ్చినందున కేంద్ర పరిపాలనా ట్రిబ్యునట్ (క్యాట్)నే ఆశ్రయించాలని కోర్టు స్పష్టం చేసింది. క్యాట్ సైతం ఆలిండియా సర్వీస్ అధికారులు ఎవరికి కేటాయించిన రాష్ట్రానికి వారు వెళ్లి తీరాల్సిందేనంటూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
ముందు తమకు కేటాయించిన రాష్ట్రంలో విధుల్లో చేరాలని సూచిస్తూ, ఆయా రాష్ట్రాల్లో చేరినప్పటికీ వీరి నియామకాలు తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది. అయితే కేంద్రం విధించిన గడువు ముగుస్తుండడంతో చివరి ప్రయత్నంగా మరోసారి హైకోర్టును ఆశ్రయించిన అధికారులకు అక్కడ ఊరట లభించలేదు.
తమను రిలీవ్ చేయకుండా ఉత్తర్వులివ్వాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. స్టే ఇస్తూ పోతే వివాదం ఎప్పటికీ తేలదని వ్యాఖ్యానించిన హైకోర్టు వివాదాన్ని తేలుస్తామని, ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని సలహా ఇచ్చింది.
ఏపీ పునర్విభజన సమయంనుంచే ఈ వివాదం కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ, తెలంగాణగా విడిపోయిన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సు మేరకు కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 284 మంది ఐఏఎస్‌లు, 209 మంది ఐపీఎస్‌లు, 136 మంది ఐఎఫ్‌ఎస్‌లను పంపిణీ చేసింది.
అయితే తాము పని చేస్తున్న రాష్ట్రాల్లోనే తమను కొనసాగించాలంటూ ఈ పది మంది అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ వీరికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే కేంద్రం 2017లో క్యాట్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది. కేంద్రం పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను పాటించి తీరాలని స్పష్టం చేసింది.
వీరంతా పదేళ్ల పాటు తమకిష్టమైన రాష్ట్రంలో పని చేసినందున వీరి అభ్యర్థనలను మరోసారి పరిశీలించాల్సిందిగా కేంద్రానికి హైకోర్టు సూచించింది. హైకోర్టు సూచన మేరకు కేంద్రం వీరి వాదనలను వినడానికి ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ప్రతి ఒక్కరి వాదనలను విన్న కమిటీ వారి అభ్యర్థనలను తిరస్కరించాలని డీఓపీటీకి సిఫార్సు చేసింది.
రెండురాష్ట్రాలూ ఐఏఎస్ అధికారుల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో డీఓపీటీ ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. తెలంగాణలో పని చేస్తున్న తమ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులను వెంటనే పంపించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే డీఓపీటీకి లేఖ రాయడం కూడా ఈ బదిలీలకు మరో కారణంగా తెలుస్తోంది. తెలంగాణనుంచి బదిలీ అయిన అధికారుల్లో కొందరు కీలక పదవుల్లో ఉన్నందున వీరి స్థానంలో కొత్త వారిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.