06-04-2025 12:00:00 AM
ఒక అద్భుతమైన నటికి కావల్సిన లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి. అందమైన ముఖం.. అంతే అందమైన చిరునవ్వు.. అద్భుతమైన నటన.. కూల్ నేచర్.. ఆమె నవ్వితే ప్రేక్షకులు నవ్వేవారు.. ఆమె ఏడిస్తే వారి కళ్ల వెంట కన్నీళ్లొచ్చేవి. ఇంతకు మించి ఒక నటికి ఏం కావాలి? 15 ఏళ్లకే వివాహం.. 18 ఏళ్లకే బిడ్డ.. ఆ తరువాత సినీ ప్రపంచం వైపు అడుగులు..
1970లో తన నటన, అందంతో ప్రజల హృదయాలను శాసించిందీ నటి. అప్పట్లో ఈమె కంటే అందమైన నటి మరొకరు లేరనేవారు. ఆమె మరెవరో కాదు.. మౌసమీ ఛటర్జీ. సినీ కెరీర్‌లో ధర్మేంద్ర, జితేంద్ర, వినోద్ ఖన్నా వంటి పెద్ద హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
తరుణ్ మజుందార్ దర్శకత్వం వహించిన బెంగాలీ హిట్ బాలికా వధు (1967)లో కథానాయికగా మౌసమీ ఛటర్జీ సినీ రంగ ప్రవేశం చేసింది. 1972లో శక్తి సమంత దర్శకత్వం వహించిన ‘అనురాగ్’ అనే చిత్రంతో బాలీవుడ్‌కు కథానా యికగా పరిచయమైంది. ఈ సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది.
మౌసుమీ ఛటర్జీకి హిందీ సినిమా ‘రోటీ కపడా ఔర్ మకాన్’తో మం చి పేరు వచ్చింది. ఆ తరువాత ‘స్వర్గ్ నరక్, మాంగ్ భరో సజ్‌నా, ప్యాసా సావన్, జ్యోతి బనే జ్వాలా, స్వయంవర్, ఆనంద్ ఆశ్రమ్’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించుకుంది.
నీ బిడ్డకు తండ్రెవరు?
మౌసమిని అప్పటి స్టార్ నటుడు రాజేశ్ ఖన్నా దారుణంగా అవమానించాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మౌసమి చెప్పుకొచ్చింది. తను గర్భవతిగా ఉన్నప్పుడు రాజేశ్ ఖన్నా ఒక ప్రశ్న అడిగాడట. అదేంటంటే.. ‘నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? నీ భర్త జయంత్ ముఖర్జీయేనా? లేదంటే నటుడు వినోద్ మెహ్రానా?’ అని ప్రశ్నించాడట.
దీంతో ఆమెకు చాలా కోపం వచ్చిందట. వాస్తవానికి వినోద్ మెహ్రా చాలా మంచివాడని, తమ పెళ్లికి కూడా వచ్చాడని మౌసమీ చెప్పుకొచ్చింది. అయినా రాజేశ్ ఖన్నా చాలా సార్లు అసహ్యంగా మాట్లాడేవాడని తెలిపింది. అయితే రాజేశ్ ఖన్నా చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆయన అనారోగ్యంతో ఉంటే పరామర్శించేందుకు వెళ్లిందట.
తన కూతురి ముందే తనపై ప్రశంసలు కురిపిస్తూ ఏదేదో మాట్లాడాడంటూ మౌసమి చెప్పుకొచ్చింది. అప్పుడు భరించలేక.. ఆయన పిల్లల వంక చూస్తూ.. ‘వీళ్లు నీ పిల్లలా? లేదంటే రిషీ కపూర్ సంతానమా?’ అని అడిగేసిందట. అది ఊహించని రాజేశ్ ఖన్నా నోటి వెంట మాట రాలేదట.
కాంప్రమైజ్‌కు..
మౌసమీ ఛటర్జీ ‘దేశ్ ప్రేమి, బర్సాత్ కీ ఏక్ రాత్’ వంటి ఎన్నో చిత్రాలకు సంతకం చేసిందట. కానీ చివరకు తనను ఆ సినిమాల నుంచి తీసేసేవారట. దానికి కారణం కూడా ఆమె తెలిపింది. వాళ్లు అడిగే కాంప్రమైజ్‌కు తాను ఒప్పుకోకపోవడమే తనను తీసేయడానికి కారణమంటూ చెప్పుకొచ్చింది. ఇలా చేసినా కూడా ఆమె వందకు పైగానే చిత్రాల్లో నటించింది.
అడ్డదారిలో సినిమాలు చేయలేనని తెలిపింది. చాలా మంది సీనియర్ హీరోయిన్లు.. ‘నువ్వింత అందంగా ఉన్నావు.. టాలెంట్ ఉంది. కానీ హీరోల ఫేవరెట్ లిస్ట్‌లో మాత్రం లేవు’ అని అనేవారట. అయినా సరే.. తనకు నచ్చని పని ఏమాత్రం చేసేదాన్ని కాదని ఓ ఇంటర్వ్యూలో మౌసమి చెప్పుకొచ్చింది.