20-04-2025 12:00:00 AM
రూపేశ్, ఆకాంక్షా సింగ్ హీరోహీరోయిన్లుగా, ‘లేడీస్ టైలర్’ కపుల్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా పవన్‌ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేశ్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేదికపై మూవీ టీజర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా విడుదల చేశారు.
ఈ సందర్భగా ఇళయరాజా మాట్లాడుతూ.. “నాకు ఎంత సంగీతం తెలుసన్నది ముఖ్యం కాదు.. సంగీతమే నా గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తోందో తెలియదు. ఆ సంగతి తెలిసిన మరుక్షణమే నేను సంగీతాన్ని ఆపేస్తా.. నాకు నాలోంచి సంగీతం ఎలా వస్తోందో నాకు ఎప్పటికీ తెలియకూడదని దేవుడిని కోరుకుంటున్నా” అన్నారు. రాజేందప్రసాద్ మాట్లాడుతూ.. “నేను ఇళయరాజాను స్వామి అని పిలిచేవాడిని.
చాలామందిని హీరోలను చేసింది ఇళయరాజా సంగీతం. అలాంటి మా ‘స్వామి’ ఇంతకాలానికి నా సినిమాకు సంగీతాన్ని అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. కీరవాణితో కూడా నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన వందవ సినిమా నా ‘రాంబంటు” అన్నారు. కీరవాణి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో రాజా సార్ ట్యూన్‌కు నేను పాట రాశాను. ఈ పాట సినిమాలోని సందర్భంతోపాటు, నా జీవితానికి కూడా సంబంధించింది.
ఇళయరాజా సంగీతానికి పాడాలనుకున్నా. కానీ, ఆ అవకాశం రాలేదు. కానీ ఆయన సంగీతానికి పాట రాసే అవకాశం వచ్చింది. ఆయన పక్కన కూర్చునే అవకాశం కూడా వచ్చింది” అన్నారు. కథానాయకుడు, నిర్మాత రూపేశ్ మాట్లాడుతూ.. ‘ఇంత పెద్ద దిగ్గజాలతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. ‘నాకు ఈ సినిమా చాలా గొప్ప అనుభవం. ఇంత గొప్పవారితో వేదిక పంచుకోవడం, వారు సినిమాకు పనిచేయడం నా అదృష్టం.
నవరసభరితమైన ఈ సినిమా మాకు గర్వకారణంగా నిలుస్తుంది’ అని కథానాయిక ఆకాంక్షాసింగ్ అన్నారు. ‘ఇంత గొప్ప వారు నా సినిమాకు పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నేను అదృష్టవంతు డిని’ దర్శకుడు పవన్ ప్రభ అన్నారు. గీత రచయిత చైతన్యప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రామ్, కళా దర్శకుడు తోట తరణి తదితర చిత్రబృందం పాల్గొన్నారు.