calender_icon.png 6 November, 2024 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక ఎన్నికల్లో పోటీ చేయను

06-11-2024 01:52:01 AM

రాజ్యసభ ఎంపీ పదవీ కాలం ముగిశాక రిటైర్మెంట్

ప్రజలకు సేవ చేస్తా

ఎన్సీపీ అధినేత శరద్ పవార్

ముంబై, నవంబర్ 5: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బారామతిలో తన మనవడు యుగేంద్ర పవార్ తరఫున మంగళవారం ప్రచారం చేస్తూ తాను  రాజకీయాల నుంచి వైదొలగడంపట్ల స్పందించారు. ఎన్నికల సభలో మాట్లాడుతూ తాను అధికారంలో లేనని చెప్పారు. తన రాజ్యసభ పదవీకాలం కూడా ఏడాదిన్నరలో పూర్తవుతుందని తెలిపారు. ఆ తర్వాత ఏ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.

ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సిందేనన్న ఆయన.. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించినందుకు బారామతి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఇందుకు తనకు అధికారం అవసరం లేదని వెల్లడించారు. 

అజిత్ పవార్‌పై పగ లేదు

తనకు అజిత్ పవార్‌పై ఎలాంటి పగ లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అజిత్ పవార్ 30ఏళ్లకుపైగా పని చేశారని, ఆయన సేవలపై ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు భవిష్యత్తు కోసం సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కొత్త నాయకుడు అవసరమని అభిప్రాయపడ్డారు. రాబోయే 30ఏళ్ల కోసం పనిచేసే నాయకత్వాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అజిత్ పవార్ బారాముల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత కొంత కాలంగా పలు సభల్లో శరద్ పవార్ వ్యతిరేకులు ఇకనైనా రాజకీయాల నుంచి రిటైర్ కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అజిత్ పవార్ కూడా శరద్ పవార్ రిటైర్మెంట్‌పై పలు సందర్భాల్లో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.