15-04-2025 12:00:00 AM
మంత్రివర్గంలో తనకు అవకాశమివ్వకపోతే ఊరుకోబోనని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. సోమవారం బాలుర పాఠశాల మైదానంలో జరిగిన ‘జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్’ సభా వేదిక పైనుంచే హెచ్చరికలు జారీ చేశారు. తాను ఉమ్మడి ఆదిలాబాద్ గళాన్ని అని, ఆ పార్టీ, ఈ పార్టీ అని తిరిగేటోళ్లకు పదవులు ఇస్తే ఊరుకోనని హెచ్చరించారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పదేళ్లు పార్టీని నమ్ముకుని, కార్యకర్తలను కాపాడుకున్న తనకు అధిష్ఠానం అన్యా యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. నిన్న, మొన్న కాంగ్రెస్‌లోకి వచ్చినోళ్లు తన గొంతు నొక్కాలని చూస్తు న్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రవెళ్లి, కరీంనగర్‌లలో భారీ బహిరంగ సభలు ఎవరు నిర్వహించారో గుర్తించుకోవాలని అధిష్ఠానాన్ని కోరా రు. తనకు అన్యాయం జరిగినా భరిస్తానని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ హెచ్చరించారు.
ఇది ఉద్యమాల గడ్డ అని మరిచిపోవద్దన్నారు. వేరే పార్టీల్లో తిరిగి తిరిగి వచ్చిన వారికే పదవులు ఇస్తారా..! పార్టీకి పదేళ్లు వెన్నుదన్నుగా ఉంటే ఇదేనా బహుమతి అని ప్రశ్నించారు. ఏడు రోజులు బెల్లంపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రకు రానివారు, డిప్యూటీ సీఎం హాజరైన నేటి (సోమవారం) సమావేశానికి కూడా వారు లేదన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు కూడా నేడు మంత్రిపదవి కావాలంటున్నారన్నారు.
ఇప్పటికే ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులిచ్చారని, మంత్రి పదవి కూడా ఇస్తే ఆదిలాబాద్ జిల్లాను వారికి దత్తత ఇచ్చినట్టే అవుతుందని పరోక్షంగా ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఊపిరి పోసిన సభ నిర్వహించినా గుర్తించరా! ఆదివాసీలకు, కార్యక ర్తలకు అండగా నిలిచిన నాయకుడిని అణచివేయాలని చూస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాటలను విన్న కాంగ్రెస్ శ్రేణులు, అనుచరులు ఎమ్మెల్యేకు మద్దతుగా నినాదాలు చేశారు.