అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఐ వాంట్ టు టాక్‘. సూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
ఈ చిత్రంలో చేసిన ఓ పనిని ఇక ముందెప్పు డూ చేయనని తెలిపారు. “ఇదొక విభిన్నమైన కథ కాబట్టి సూజిత్ కథ చెప్పిన వెంటనే ఓకే చేశాను. ఈ సినిమాలో నా లుక్, రోల్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది. ఈ పాత్ర కోసం నేను చాలా బరువు పెరిగాను పైగా పొట్టతో కనిపిస్తాను. ప్రొస్థటిక్ మేకప్ సాయంతో అలా కనిపించానని అందరూ అనుకుంటున్నారు కానీ దానిలో నిజం లేదు.
నేను సినిమా కోసం ఎంతో కష్టపడి బరువు పెరిగాను. కానీ ఇకపై ఏ సినిమా కోసం బరువు పెరగకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఈ వయసులో బరువు పెరిగితే తగ్గడమనేది చాలా కష్టం” అని అభిషేక్ బచ్చన్ తెలిపారు. ఈ చిత్రంలో అభిషేక్ ఎన్నారై పాత్రలో కనిపించనున్నారు. జీవితాన్నే మార్చే ఓ ఆపరేషన్ చేయించుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకునే వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.