పాత్ర నచ్చితే చాలు.. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనే ఆలోచన లేకుండా నటించే నిత్యామీనన్ ఇక మీదట తనసలు సినిమాలే చేయనంటోంది. ఇప్పటి వరకూ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి ఇకపై ఇండస్ట్రీని శాశ్వతంగా వదిలేస్తానని స్పష్టం చేస్తోంది. నిత్యా మీనన్ నటించిన తమిళ చిత్రం ‘కాదలిక్క నెరమిళ్లు’ విడుదలకు సిద్ధమవుతోంది.
దీని ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిత్య తనకు సినిమా అంటే ఇష్టం లేదని, అయినా కొన్నేళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నానని తెలిపింది. జాతీయ అవార్డు వచ్చిన తరువాత నిత్య ఇలా మాట్లాడటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. “వాస్తవానికి నేను సినిమాలు మానేయాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక మేజిక్ జరుగుతూనే ఉంటుంది.
ఇక ఈసారి తగ్గేదేలేదు.. సినిమాల నుంచి పక్కకు పోవాల్సిందేనని ఫిక్స్ అయ్యాక నాకు ‘తిరుచిత్రంపళం’ మూవీకి జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అప్పుడు కానీ సినిమా నన్ను వదిలేలా లేదని అర్థం కాలేదు. ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీ లో ఏదైనా అవకాశం వస్తే కచ్చితంగా వెళ్లిపోతాను. నటి గా ఉంటే స్వేచ్ఛగా జీవించలేం కాబట్టి సాధారణ జీవి తం గడపాలని ఉంది” అని చెప్పుకొచ్చింది నిత్య.