* తాజా ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ ప్రకటన
* పూర్తి మద్దతు తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ
* హర్యానా, మహారాష్ట్రల్లో ఓటమికి కాంగ్రెస్సే కారణమని విమర్శ
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడ్డ ఇండియా కూటమి చీలికల దిశగా పయనిస్తోంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయక త్వంపై కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే కూటమికి నాయకత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాలీ న్యూస్ ఛానల్‌కు శుక్రవారం ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తనకు అవకాశం వస్తే ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తానని తెలిపారు. ఇండి యా కూటమిని తానే స్థాపించినట్టు తెలిపారు.
కూటమికి నాయకత్వం వహిస్తున్న వారు సమర్థవంతంగా పని చేయాల్సి ఉం టుంది. కానీ ఆ బాధ్యతల్లో ఉన్న వారు సక్రమంగా పని చేయడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. ప్రతి ఒక్కరినీ కలుపకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక వేళ ఇండియా కూటమికి నాయకత్వం వహించే అవకాశం వచ్చినప్పటికీ బెంగాల్‌ను విడిచి మాత్రం పోనని ఆమె వెల్లడించారు. సీఎంగా బా ధ్యతలు నిర్వర్తిస్తూనే ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తానని మమత స్పష్టం చేశారు.
ఓటమికి కాంగ్రెస్సే కారణం
కూటమి బాధ్యతలను మమతా బెనర్జీకి అప్పగించడానికి సమాజ్‌వాదీ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. మమత ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని అమెకు కూటమి నేతలు మద్దతు ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉదయ్‌వీర్ సింగ్ ఓ ప్రకటనలో సూచించారు. కూటమి బలోపేతానికి ఆమె కృషి చేస్తుందని విశ్వా సం వ్యక్తం చేశారు.
బెంగాల్‌లో బీజేపీని అడ్డుకోవడంలో ఆమె సఫలీకృతం అయ్యారని పేర్కొన్నారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమికి కాంగెస్ నాయకత్వ లోపమే కారణ మని విమర్శించారు. ఆయా రాష్ట్రాల్లో కాం గ్రెస్సే నాయకత్వం వహించిందనీ ఓటమికి ఆ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఓటములపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మరోవైపు సీపీఐ జనరరల్ సెక్రటరీ డి. రాజా కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాల మాట వినలేదని ఆరోపించారు. ఆ పార్టీ ఒక వేళ మిత్ర పక్షాలకు సరైన ప్రధాన్యం ఇ చ్చి ఉంటే ఫలితా లు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డా రు. తాజా పరిణామాలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ కూటమిలో మమతా బెనర్జీ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇండియా కూటమికి టీఎంసీ, ఆమ్‌ఆద్మీ, శివసేన ఏ పార్టీ నాయకత్వం వహించినప్పటికీ తామం తా కలిసే పని చేస్తామని తెలిపారు. ఈ విషయాలపై మమతతో చర్చించేందుకు త్వరలో నే కోల్‌కత్తా వెళ్లనున్నట్టు వెల్లడించారు.
ఆర్జేడీ కొత్తరాగం
ప్రతిపక్ష కూటమికి నిజమైన రూపశిల్పి లాలూ ప్రసాద్ యాదవే అని ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ పేర్కొన్నారు. లాలూ చొరవతోనే విపక్ష కూటమి తొలి సమావేశం పాట్నాలో జరిగిందని తెలిపారు. అయితే, ఇండియా కూటమిని తానే స్థాపించినట్టు మమతా బెనర్జీ ప్రకటించిన అనంతరం ఆర్జేడీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాంగ్రెస్ విముఖత
కూటమి నాయకత్వ మార్పు అంశంపై విపక్ష కూటమి నేతలు తమ స్వరాన్ని వినిపిస్తుంటే కాంగ్రెస్ మాత్రం మిన్నకుండిపోయింది. నాయకత్వ మార్పును ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమికి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 101 స్థానాలను దక్కించుకుని కూటమిలో హస్తం పార్టీ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉన్న కాంగ్రెస్.. కూటమి నేతల ఒత్తిడికి తలొగ్గి సారథ్య బాధ్యతలను మమతా బెనర్జీకి అప్పగించడానికి అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రస్తతం ఆసక్తిగా మారింది.
ఎంవీఏకు సమాజ్‌వాద్ పార్టీ గుడ్ బై
మహా వికాస్ ఆఘాడీ(ఎంవీఏ) నుంచి తమ పార్టీ తప్పుకుం టున్నట్టు సమాజ్‌వాదీ పార్టీకి చెం దిన ఎమ్మెల్యే ప్రకటించారు. బాబ్రీ మసీదును కూల్చి 32ఏళ్లవుతున్న సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు ఒకరు ఆ ఘటనపై హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మసీదును కూల్చిన వారిని చూసి గర్విస్తున్నట్టు పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై సమాజ్‌వాదీకి చెందిన ఇద్దరు ఎమ్మె ల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి మతతత్వ భావజాలాన్ని తమ పార్టీ ప్రోత్సహించదని పేర్కొంటూ ఎంవీఏను వీడుతున్నట్టు తెలిపారు.