calender_icon.png 28 November, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ చెప్పినట్టు చేస్తా

28-11-2024 04:34:02 AM

  1. సీఎం విషయంలో వారి నిర్ణయమే ఫైనల్
  2. పదవి కన్నా బాల్ ఠాక్రే ఆశయాలే ముఖ్యం: షిండే
  3. అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం: ఫడ్నవీస్

ముంబై, నవంబర్ 27: మహారాష్ట్రకు సీఎం ఎవరనే అంశంపై సందిగ్ధం నెలకొన్న వేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా నిర్ణయమే ఫైనల్ అని, వారు తీసుకునే నిర్ణయానికి తనతో పాటు శివసైనికులు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. సీఎం పదవి కోసం కా కుండా బాల్‌ఠాక్రే ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మహాయుతికి చరిత్రాత్మక విజయం అందించిన ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని షిండే ఉద్ఘాటించారు. తాను కూడా సామాన్య రైతు కుటుంబం నుంచే వచ్చానని, అందరి కష్టాలు తనకు తెలుసునని షిండే అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చామని, ముఖ్యమంత్రిగా తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెపారు. 

ఉమ్మడి నిర్ణయమే: ఫడ్నవీస్

సీఎం పదవిపై మూడు పార్టీలు చర్చిస్తున్నాయని, త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తామని మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మూడు పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉమ్మడిగానే సీఎంను ఎంపిక చేస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎలాంటి తొందర లేదని చెప్పారు.

అయితే ముఖ్యమంత్రి పదవితో పాటు బీజేపీ, శివసేన, ఎన్సీపీకి చెందిన నేతలకు మంత్రి పదవులపై ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. మహాయుతి ప్రభుత్వంలో సీఎంతో పాటు 43 మంది మంత్రులు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది.