వికారాబాద్, జనవరి 25: ప్రజలకు మేలు చేయడమే నా జీవిత లక్ష్యం, నాకు ఎలాంటి ఆశలు లేవని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నా రు.శనివారం మోమిన్ పేట్ ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 42 మంది లబ్ధిదారులకు 42,04,873 విలువ గల చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 19 మంది లబ్ధిదారులకు 8 లక్షల 20 వేల చెక్కులను పంపిణీ చేశారు.
అదేవిధంగా 1.69 కోట్ల నాబార్డు వారి ఆర్థిక సహాయంతో నిర్మాణం చేపట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాము, కార్యాలయాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ...పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని శాసనసభ సభాపతి హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లాకు 950 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని, మోమినిపేట్ మండలానికి 44 కోట్ల 56 లక్షల నిధులు విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణాలు చేసుకునేందుకు వికారాబాద్ నియోజకవర్గానికి 12 వేల ఇండ్లు మంజూరు అయ్యాయని, మరో విడతలో కూడా ఇంకా ఇల్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి ఒక్కరు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
జిల్లాలో కులాలకు అతీతంగా 25 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల వ్యయంతో సమీకృత పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే జిల్లాలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు గాను ఆసుపత్రులనుబలోపేతం చేస్తూనే, వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి అధ్యక్షులు కొత్త కురుమ సత్తయ్య, డైరెక్టర్ అంజిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.