09-03-2025 12:53:01 AM
రేవంతన్నా అని పిలుస్తున్నారు.. ఇక మీ కుటుంబ బాధ్యత నాది
మీ అన్నగా చెబుతున్నా.. కోటిమందిని కోటీశ్వరులను చేస్తా
చంద్రగ్రహణం తొలగింది.. ఇందిరా మహిళా శక్తి వచ్చింది
మహిళలు ఆర్థికంగా బలపడ్డప్పుడే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ‘మీ అన్నగా చెబుతున్నా.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, ఈ ప్రభుత్వానిది’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్పు కోసం ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆడబిడ్డలు ఆకాంక్షించారని, ఆ మార్పు ను తమ 15 నెలల పాలనలో చేసి చూపించామని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ పాలనలో ఏనాడు కూడా స్వయంసహాయక సంఘాలను పట్టించుకోలేదన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టిందని, తమ సర్కారు హయాంలో ఆ గ్రహణం తొలగిపోవడంతో వారు ఇప్పుడు వెలుగులు చూస్తున్నారన్నారు. అందుకు పరేడ్ గ్రౌండ్‌లోని ఈ సభే నిదర్శనమని చెప్పారు.
శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళా దినో త్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి బహిరంగ సభకు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతి కుమారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి లక్షకుపైగా మహిళలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్‌లో రాణీరుద్రమ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రాష్ర్ట రాజ ధానిలో మహిళలు తమ ఆత్మగౌరాన్ని చాటారన్నారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసినప్పుడే రాష్ర్టం ఆర్థ్ధికంగా పురోగమిస్తుందన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడంతోనే తెలంగాణ ఒక ట్రిలియల్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. మహిళా సంఘాల సమావేశాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో రూ.25 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను వారికి అప్పగించినట్లు వివరించారు.
తెలంగాణ మహిళలు అదానీ, అంబానీలతో పోటీపడేలా కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేస్తున్నామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించబోతున్నామన్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని వాటి నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించినట్లు సీఎం పేర్కొన్నారు. కోటి 30 లక్షల జతల స్కూల్ యూనిఫామ్‌ల కుట్టుపని బాధ్యతలను మహిళలకు ఇచ్చామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి యూనిఫామ్‌లను కుట్టే బాధ్యతలను తమ అనుయాయలకు అప్పజెప్పారన్నారు. కానీ తాము మాత్రం ఆ బాధ్యతలను ఆడబిడ్డలకు ఇచ్చామన్నారు.
పందికొక్కులకు బుద్ధి చెబుతాం
రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గోడౌన్స్ నిర్మించుకొని, నిర్వహించుకునే అవకాశం కల్పిస్తామని.. దీని తాను బాధ్యత తీసుకుంటానన్నారు. మిల్లుల్లో ధాన్యాన్ని కొందరు పందికొక్కులు బొక్కుతున్నారని, ఆ దొంగలకు బుద్ధి చెబుతామని స్ప ష్టం చేశారు. ఈ దొంగలకు బుద్ధి చెప్పేందుకు మహిళలతో రైస్‌మిల్లులతో గోదాములను కట్టించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
మహిళలకు ప్రభుత్వ మే స్థలం ఇస్తుందని, రుణాలు ఇప్పిస్తుందని, గోదాములను నిర్మించుకొని వ్యాపారవేత్తలుగా ఎదగాలని, ఎందు కు ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు. మహిళలు ఏర్పాటు చేసిన మిల్లులు, గోదాముల నుంచి బి య్యాన్ని సరఫరా చేస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తిని ప్రపంచానికే ఆదర్శంగా నిలబడేలా తీర్చి దిద్దుతామని వెల్లడించారు.
అలాగే, హైటెక్ సిటీ శిల్పరామం పక్కన 150 షాపులను మహిళా సంఘాలకు అందించామని, అక్కడ ఉత్పత్తులను ప్రదర్శించి, కార్పేరేట్ శక్తులతో పోటీ పడాలన్నారు. రెసిడెన్సియల్ స్కూళ్లలో ప్రోటీన్ ఆహారాన్ని మహిళా సంఘాల ద్వారా అందించేందుకు ప్రణా ళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల భవనాలు ఒక్కదాని కోసం రూ. 25 కోట్లను కేటాయించామన్నారు. మహిళలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు వెయ్యి మెగావాట్ల సోలార్ పాంట్లను వారికి అప్పజెప్పినట్లు పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌కు పైశాచిత ఆనందమా?
శ్రీశైలం టన్నెల్ కూలిపోయి జనాలు చనిపోతే బీఆర్‌ఎస్సోళ్లు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నరు. రోడ్డుమీద యాక్సిడెంట్ అయినా ప్రాణాలు పోయినా, పంట ఎం డిపోయినా ఆనందంతో గంతులేస్తున్నరు. ఇంత పై శాచితక ఆనందం ఎక్కడన్న ఉంటదా? టన్నెల్ కూలి నా, రోడ్డు మీద ప్రమాదం జరిగినా, ఎండలకు పంటలు ఎండిపోయినా..
కాళేశ్వరం కూలిపోయినా రేవంత్ రెడ్డి ని తిట్టొచ్చని వాళ్లు ఆలోచిస్తున్నారు. నన్ను తిడుతూ పైశాచిత ఆనందం పొందడం మంచిదా? బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని, తాము అధికారంలోకి వచ్చిన 15 నెలలకు ఈ ఏడుపులు, పెడబొబ్బలు ఎంట ని నిలదీశారు.
ప్రజలకు కష్టమొచ్చినప్పుడు ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందిపోయి, వారి పదేళ్ల పాలన అనుభవంతో సూచనలు చేయాల్సింది పోయి.. ఈ పైశాచిక ఆనందం పొందడంపై నిప్పులు చెరిగారు. ఇది మంచిది కాదని, పైశాచితక ఆనందం పొందినోళ్లు బాగుపడినట్లు చరిత్రలో లేదని స్పష్టం చేశారు.
ఒక్క మహిళా మంత్రి లేరు..ఒక్క మహిళా మంత్రి లేరు..
బీఆర్‌ఎస్ మొదటి క్యాబినెట్‌లో ఒక్క మహిళా మం త్రి కూడా లేరని, కానీ తమ ప్రభుత్వంలో కొండా సురే ఖ, సీతక్క ఇద్దరు ఉన్నారన్నారు. గతంలో మహిళలకు అండగా నిలబడింది ఇందిరమ్మ రాజ్యమే అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీది అని, సోనియాగాంధీ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళలు రాణించాలని, సమాజానికి సేవ చేయాలన్నారు.
మనది పేగుబంధం కంటే అతీతమైనది..
మొదటి తరంలో ఇందిరా గాంధీని అమ్మా అన్నారని, రెండో తరంలో ఎన్టీఆర్‌ను అన్నా అన్నారని, ఇప్పుడు తనను రేవంతన్న అంటున్నారని సీఎం పేర్కొన్నారు. తనను అన్నా అన్నారంటే..కుటుంబ బాధ్యతను తీసుకోవడమే అన్నారు. ఇది పేగు బంధం కంటే అతీతమైనద న్నారు. ఆడబిడ్డల ఆశీస్సులతో తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని అయినట్లు చెప్పారు. రేవంతన్నగా ఆడబిడ్డలకు తోడుగా ఉంటానని, కోటి మందిని కోటిశ్వరులుగా చేసి, అభివృద్ధి పథవైపు నడిపిస్తానని వివరించారు.
బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు: డిప్యూటీ సీఎం భట్టి
పది సంవత్సరాలు పాలనలో బీఆర్‌ఎస్ ఏరోజు మహిళా అభ్యున్నతి గురించి కానీ, డ్వాక్రా సంఘాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెద్ద పీట వేశామన్నారు. ఐకేపి పథకాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.
పది సంవత్సరాల పాటు ఏడు లక్షల కోట్ల అప్పును పంది కొక్కుల తిన్నారే తప్పితే, మహిళా సాధికారతకు గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా విధానపరమైన నిర్ణయా లు తీసుకుని ఈ ఏడాది 20వేల కోట్ల రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మాత్రం అది సాధ్యమేనా అంటూ హేళన చేస్తున్నారన్నారు.
పది సంవత్సరాల కాలంలో కనీసం 10 వేల కోట్లు కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీష్ రావు బడితే లాగా పెరిగాడే తప్పితే.. మహిళలకు కనీసం పది వేల కోట్ల రుణాలు ఇప్పించలేదన్నారు.
తాము తాము రూపాయి, రూపాయి పోగేసి సృష్టించిన సంపదను ప్రజల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. అది చూసి ఓర్వలేక అవాకులు- చెవాకులు మాట్లాడుతున్నారని భట్టి విమర్శించారు. రాష్ర్టం లో దొరల దోపిడీని పదేళ్లు చూశామని, వారి పాలన మళ్లీ రానీయొద్దని పిలుపునిచ్చారు.
ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు: మంత్రి సీతక్క
మహిళల కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుం టే.. కొందరు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కోటి మంది కోటీశ్వరులు కావాలి సంకల్పంతో లక్ష్యంతో సీఎం రేవం త్‌రెడ్డి పనిచేస్తుంటే వారికి కం టికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిన్నటి దాకా మహిళలంటే ఒక వంట గదికే పరిమితం మహిళలు ఫ్రీగా బస్సు ఎక్కితే నచ్చడం లేదన్నా రు. ప్రజా ప్రభు త్వం అంటేనే అన్నదమ్ముల, అక్క చెల్లెలు ప్ర భుత్వమన్నారు.
ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభం
తొలుత సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అలాగే, ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీని ఆవిష్కరించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్టంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.22వేల 794 కోట్ల 22 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
రాష్ర్టంలోని మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా పథకాల కోసం రూ.44 కోట్ల 80 లక్షలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను సీఎం సన్మానించారు. మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ చరణ్ అర్జున్, గాయకులు మధుప్రియ, విహా, రాచకొండ అనిల్ సన్మానాన్ని అందుకున్నారు.