calender_icon.png 8 April, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదట జైలుకు వెళ్లింది నేనే!

06-04-2025 12:00:00 AM

తెలంగాణ ఉద్యమం సబ్బండ వర్ణాలను తనలోకి లాక్కుంది. ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వలేదు. పోరాడితే తప్ప రాష్ట్రం సిద్ధించదు అనే ఎరుకను యావత్ తెలంగాణ ప్రజల్లో కలిగించింది. దాని ఫలితమే పిల్లాజెల్లా, ముసలీముతక, యువత అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. కొందరు ఆడిపాడితే.. మరికొందరు అలయ్‌బలయ్ అన్నారు. కొందరు సమూహిక దీక్షలు చేస్తే మరికొందరు సమరానికి సై అన్నారు.

ఎవరు ఏమన్నా, ఏ కార్యాచరణ ప్రకటించినా అందరిదీ ఒకే నినాదం అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. పుస్తకాలను పక్కన పెట్టి పోరుబాట పట్టిన వాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు డాక్టరు బండారు వీరబాబు ఒకరు. నాడు మలిదశ ఉద్యమ ఘటనలను ‘విజయక్రాంతి’తో పంచుకున్నారిలా.. 

2009 డిసెంబర్ 7న ఉదయం 10 గంటలకు ఉద్యమ కార్యాచరణ గురించి హైకోర్టు అడ్వొకేట్ జే రామచంద్రరావు ఇంట్లో కేసుల విషయం చర్చిస్తుంటే నాతోపాటు జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఫలాక్‌నూమాకు తీసుకెళ్లారు. అక్కడ మమ్మల్ని వేర్వేరు గదుల్లో ఉంచి ఒక్కొక్కరిని ఇంటరాగేషన్ చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ౩ గంటలకు నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు.

మేం ఉస్మానియా యూనివర్సిటీ కానిస్టేబుల్‌పై దాడి చేశామనే ఆరోపణతో మాపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. మాపై అట్రాసిటీ కేసు బనాయించడాన్ని జడ్జీ తప్పుపట్టారు. నేనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి నేను కులం పేరుతో అవమానించడం అనేది హాస్యాస్పదం. అనంతరం జడ్జీ మాకు 14 రోజుల రిమాండ్ విధించాడు. జడ్జీ అనుమతితో మమ్మల్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

జై తెలంగాణ నినాదాలతో జైలులోకి..

బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్‌ఎఫ్) విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న క్రమంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నా. కానీ, జైలుకు వెళ్లడం అదే మొదటిసారి. జైల్లోకి కూడా మేం జై తెలంగాణ నినాదాలు చేస్తూనే వెళ్లాం. మొదట్లో జైలుకు వెళ్లేటప్పుడు బాధ అనిపించింది. కానీ, అక్కడే ఉన్న తెలంగాణ జవాన్‌లు, అధికారులు ఇచ్చిన సహకారం వల్ల మాకు జైల్లో ఉన్నామన్న బాధ కలగలేదు. 53 ఏళ్లుగా తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా నేను జైలుకు రావడం జీవితంలో గొప్ప ఘట్టంగా భావిస్తున్నా. 

గొప్పగొప్ప నాయకులతో అనుభవాలు..

జైళ్లో ఉన్న సమయంలో మమ్మల్ని చూడటానికి 1969 ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు మొదలు, ఇప్పటివరకు ఉద్యమంలో కీలకంగా ఉన్న అన్నీ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ఉస్మానియా జేఏసీ నాయకులు వచ్చారు. మందకృష్ణ మాదిగ, గద్దర్, వరవరరావు వంటి ప్రజాఉద్యమ నాయకులు మమ్మల్ని పరామర్శించి, ప్రజా ఉద్యమాల సమయంలో వారు జైళ్లో గడిపిన అనుభవాలను మాతో పంచుకున్నారు. అలాగే మా యూనివర్సిటీ అధ్యాపకులు మాకు ధైర్యానిచ్చారు. 

బెదిరించేందుకు కోర్టుకు పిలిచారు.. 

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న మమ్మల్ని ఉద్యమానికి దూరం చేయాలని, భయబ్రాంతులకు గురిచేయాలని కోర్టుకు మా తల్లిదండ్రులను పిలిపించారు. గొప్ప లక్ష్యం కోసమే తమ పిల్లలు జైలుకు వెళ్లారనే నమ్మకంతో మా తల్లిదండ్రులు ధైర్యంగా ఉన్నారు. మమ్మల్ని జైలు నుంచి విడిపించేందుకు అడ్వొకేట్లు మహదేవన్, నవీన్, జే రాంచంద్రరావు, రాంరెడ్డిలు తమ సొంత పనులు వదులుకొని మా కోసం పనిచేశారు. వారి కృషిని మేం ఎప్పటికి మరవలేం. 

12 రోజులు జైళ్లో ఉన్నా..

మేము 12 రోజులపాటు జైళ్లో ఉన్నాం. ఆ తర్వాత బెయిల్ రావడంతో విడుదలై బయటకు వచ్చాం. బయటికి వచ్చినప్పుడు మమ్మల్ని యూనివర్సిటీ విద్యార్థులు డప్పులతో స్వాగతం పలికి తీసుకెళ్లారు. మాకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్స్, మాతోటి విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు స్వాగతం పలుకడం ఎప్పటికీ మరువలేం.

ఒక న్యాయమైన డిమాండ్ కోసం పోరాడితే ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి ఎంత మద్ధతు ఉంటుందో ఈ సంఘటనే ఉదాహరణ. చాలామంది మేం జైలుకు వెళ్లిరావడం ఏదో గొప్పగా అనుకుంటున్నారు. కానీ, తెలంగాణ కోసం, ఈ ప్రాంతాన్ని విముక్తి చేసేందుకు ఎంతోమంది విద్యార్థులు, యువకులు తమ ప్రాణాలను సహితం తృణప్రాయంగా అర్పించారు. అమరుల త్యాగాలతో పోల్చుకుంటే మా జైలు జీవితం చాలా చిన్నది. 

స్వరాష్ట్ర ఫలాలు కింది వర్గాలకు చేరలేదు 

నాడు మాలాంటి ఎందరో చేసిన ఉద్యమ ఫలితంగా తెలంగాణ స్వరాష్ట్ర సాకారం అయితే జరిగింది. కానీ, అనుకున్న ఫలితాలు మాత్రం నేటికీ కింది వర్గాలకు చేరలేదు. పదేళ్ల కాలంలో ఆ కలల్ని సాకారం చేసుకోవడం అంత ఈజీకాదనేది నా అభిప్రాయం. అయితే, సీమాంధ్ర దోపిడీ వర్గాల చెర నుంచి విడుదలైన స్వయం పాలనను సాధించుకోవడం మంచిదే. ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. 

 -రూప