calender_icon.png 25 March, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ వీడియో చూసి నివ్వెరపోయా

24-03-2025 12:43:53 AM

  1. అగ్నిప్రమాదం తర్వాత ఎటువంటి డబ్బును స్వాధీనం చేసుకోలేదు
  2. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణ

న్యూఢిల్లీ, మార్చి 23: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి నుంచి భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్న ట్టు వచ్చిన ఆరోపణపై ఆయన ఇచ్చి న వివరణ బయటికొచ్చింది. వివరణలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిచిన యశ్వంత్‌వర్మ.. తన నివాసం నుంచి ఎటువంటి కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం గానీ, సీజ్ గానీ చేయలేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు.

మార్చి 14న ఘటన జరిగిన తర్వాత కాలిపోయిన నోట్ల బస్తాలను అధికారులు తీసుకెళ్లినట్టుగా గానీ డబ్బును సీజ్ చేసినట్టుగా గానీ తన కూతురుగానీ ఇంట్లో పని చేసే సిబ్బందిగానీ తనకు చెప్పలేదన్నారు. నోట్ల కట్టలు కనిపించాయంటూ చెబుతున్న విజువల్స్‌ను ఉద్దేశిస్తూ.. తనపై బురదజల్లడం ద్వారా ప్రతిష్టను భంగపరిచేందుకు జరిగిన కుట్రగా అభివర్ణించారు.

వీడియోలోని దృశ్యాలను చూసి, తాను నివ్వెరపోయానన్నారు. ప్రమాద స్థలిలో కనిపించినట్టు చెబుతున్న కాలిన నోట్ల కట్టలను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. తన ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకులు, యూపీఏ అప్లికేషన్లు, కార్డుల ద్వారానే జరిగాయన్నారు.

మంటలను ఆర్పే సమయంలో తన కుటుంబ సభ్యులు, సిబ్బందిని భద్రతా కారణాలతో దూరంగా ఉండమని చెప్పారని, మంటలు చల్లార్చిన తర్వాత కూడా తమ సిబ్బంది, కుటుంబ సభ్యులకు అక్కడ ఎలాంటి డబ్బు కనిపించలేదని వర్మ పేర్కొన్నారు.

స్టాఫ్ కార్వర్ట్స్ సమీపంలో కానీ, ఔట్ హౌస్ సమీపంలో కానీ బహిరంగంగా నగదు నిల్వ చేయాలనే ఆలోచన నమ్మశక్యం కాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన వివరణలో జస్టిస్ వర్మ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నగదు స్వాధీనానికి సంబంధించిన అంశంపై దర్యాప్తు నివేదికను సుప్రీం కోర్టు శనివారం విడుదల చేసింది.