calender_icon.png 27 January, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేనేమీ టార్గెట్ కాలేదు..

26-01-2025 12:44:00 AM

  1. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయ్ 
  2. నిజానిజాలు తెలుసుకొని వార్తలు రాయండి
  3. మీడియా సమావేశంలో నిర్మాత దిల్‌రాజు

సినిమా ప్రతినిధి, జనవరి 25 (విజయక్రాంతి): నాలుగు రోజులుగా టాలీవుడ్ ప్రము ఖుల ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు స్పందించారు. తనపై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో మీడియా తీరు, రూమర్లను ఖండించారు. ఈ విషయమై దిల్‌రాజు శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐటీ దాడులు జరగడం సహజం. మా మీద సెర్చ్ జరిగి 18 ఏళ్లు అయింది. ఇదంతా ప్రాసెస్‌లో భాగమే. గతంలోనూ మాపై 2008లో ఐటీ దాడులు జరిగాయి.. మళ్లీ ఇప్పుడు. ఏ వ్యాపారంలో ఉన్నా ఇలాంటి రైడ్స్ సహజం. అలా మా నివాసా లు, ఆఫీస్‌లోనూ జరిగాయి. అయితే కొందరు తెలిసీ తెలియక మీడియా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాశారు.

మా దగ్గర ఖరీదైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయని, కోట్ల రూపాయల నగదు దొరికిందని ప్రచారం చేశారు. అవన్నీ అవాస్తవాలే’ అని స్పష్టం చేశారు. ‘దయచేసి మా మీద తప్పుడు వార్తలు వేయొద్దు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించాం. 24 క్రాఫ్ట్స్‌లో లావాదేవీల వివరాలు తీసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిష న్.. ఇలా అన్నింటి పత్రాలూ చూపించాం. బంగారానికీ లెక్కలు చూపాం.

ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది. మా అందరి దగ్గర కలిపి రూ.20 లక్షల నగదే దొరికింది. వాటన్నింటికీ లెక్కలున్నాయి. గత ఐదేళ్లలో మేము ఎలాంటి ఆస్తులనూ కొనుగోలు చేయలేదు. ఆ విషయాన్ని ఐటీ అధికారులకు చెప్పాం. ఫైనల్‌గా నావద్ద డాక్యూమెంట్స్ చెక్ చేశారు. అంతా క్లీన్‌గా ఉందంటూ డిపార్ట్‌మెంట్ వారే ఆశ్చర్యపోయారు. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారు. ఆడిటర్స్ వెళ్లి కలుస్తారు’ అని తెలిపారు. 

గుండెపోటు కాదు.. లంగ్స్ ఇన్‌ఫెక్షన్ 

దాడుల నేపథ్యంలో దిల్ రాజు తల్లి అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘మా అమ్మకు కొన్ని రోజులుగా జలుబు, దగ్గు ఉంది. ఇటీవల దగ్గు ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో చేర్పించాం. ఇది తెలుసుకోకుండా ఆమెకు గుండెపోటంటూ వార్త లు రాశారు. లంగ్స్ ఇన్‌ఫెక్షన్ వల్ల కాస్త దగ్గు ఎక్కువైంది. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు’ అని తెలిపారు.

ఇండస్ట్రీ పరిస్థితి గురించి చెబుతూ .. ‘సినీ పరిశ్రమలో బ్లాక్ మనీ అనేదే లేదు. దాదాపు ఎనభై శాతం ఆడియన్స్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. ఇక బ్లాక్‌మనీ ఎక్కడి నుంచి వస్తుంది. కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించటం తప్పు.. తీరు మార్చుకోవాల్సిందే. దీని గురించి మేం చర్చిస్తాం’ అన్నారు.